WPL 2026 : ఆ ఒక్క తప్పిదంతోనే ఓడిపోయాం.. లేదంటేనా.. హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్..
ఆ ఒక్క తప్పిదం కారణంగానే గెలవాల్సిన డబ్ల్యూపీఎల్ (WPL 2026) తొలి మ్యాచ్‌లో ఓడిపోయినట్లు ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
WPL 2026 Harmanpreet Kaur comments after Mumbai Indians lost to Royal Challengers Bengaluru (pic credit@wplt20)
- డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో తలపడిన ఆర్‌సీబీ, ముంబై
- ఆఖరి బంతికి ఓడిన ముంబై
- ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్ వైరల్
WPL 2026 : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ తొలి మ్యాచే అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. నరాలు తెగె ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి ముంబై పై ఆర్‌సీబీ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. ఆర్‌సీబీ బ్యాటర్ నదైన్ డిక్లెర్క్ ను ఔట్ చేసే అవకాశాలను చేజార్చడంతోనే తాము ఓటమి పాలు అయ్యామని చెప్పుకొచ్చింది. ఇక ఆఖరి ఓవర్‌లో ఒక్క మంచి బంతి వేసినా కూడా ఫలితం మరో రకంగా ఉండేదని అభిప్రాయపడింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సజీవన్ సజన (45; 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), నికోలా కేరీ (40; 29 బంతుల్లో 4 ఫోర్లు), జి కమలినీ (32; 28 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20) పర్వాలేదనిపించింది. ఆర్‌సీబీ బౌలర్లలో నదైన్ డిక్లెర్క్ నాలుగు వికెట్లు తీసింది. లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం నదైన్ డిక్లెర్క్ (63 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీ 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గ్రేస్ హారిస్ (25), అరుంధతి రెడ్డి (20), స్మృతి మంధాన(18) లు పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో నికోలా కారీ, అమేలియా కెర్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓటమి గురించి ఆలోచించం..
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఆఖరి ఓవర్‌లో ఎన్ని పరుగులు అవసరమైనా.. వాటిని సాధించగల సామర్థ్యం ఆమెకు (నదైన్ డిక్లెర్క్) ఉందని తెలుసు. ఆఖరి ఓవర్‌లో మేము ఒక్క మంచి బంతి కూడా వేయలేకపోయాము. టీ20 క్రికెట్‌లో కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. అని అంది
ఇక నదైన్ డిక్లెర్క్ ను ఔట్ చేసే అవకాశాలను రెండు మూడు సార్లు చేజార్చుకున్నామని, ఇలా చేస్తూ ఉంటే బ్యాటర్లు విశ్వాసం పెరుగుతుందని హర్మన్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ మ్యాచ్ గెలవడానికి శాయశక్తుల ప్రయత్నించినట్లు హర్మన్ తెలిపింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామంది. ఇక ఆఖరి ఓవర్‌లో ఒక్క మంచి బంతి పడినా ఫలితం మరో రకంగా ఉండేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ మ్యాచ్ గురించి తాము ఎక్కువగా ఆలోచించమని, ఈ ఓటమి నుంచి నేర్చుకుంటామని అంది. తదుపరి మ్యాచ్ పైనే ప్రస్తుతం తమ దృష్టి ఉందని చెప్పింది.
తదుపరి మ్యాచ్ లో ఎలా రాణించాలి అనే దానిపై అందరం కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపింది. ఇక ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని అంది. మ్యాచ్ సాగే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలించిందని అంది.
