Yograj Singh : నేను చావడానికి సిద్ధంగా ఉన్నా.. వాళ్లంతా నన్ను వదిలేశారు.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్..
Yograj Singh : యోగ్‌రాజ్ సింగ్‌కు 62ఏళ్లు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
Yograj Singh
Yograj Singh : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచారు. తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ తరచూ వార్తల్లో నిలిచే యోగ్‌రాజ్ సింగ్.. తాజాగా.. తన జీవితంలో బాధపడిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం నేను చావడానికి సిద్ధంగా ఉన్నానని.. తాను ప్రేమించిన వారంతా దూరమయ్యారు.. తన జీవితంలో సాధించాల్సింది.. అనుభవించాల్సింది ఏమీ లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
యోగ్‌రాజ్ సింగ్‌కు 62ఏళ్లు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ‘ప్రతీరోజూ సాయంత్రం నేను ఒంటరిగా ఇంట్లో ఉంటాను. నా వంట కోసం పనివారిని పెట్టుకున్నా. వారు వారి పనిచేసుకొని వెళ్లిపోతారు. నాకు మనవళ్లతో సహా కుటుంబంలోని ప్రతీ ఒక్కరితో కలిసి ఉండాలని ఉంది. ఎందుకో తెలియదు.. అందరూ నన్ను వదిలి దూరంగా ఉంటున్నారు. జీవితంపై విరక్తి వస్తుంది. అందుకే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. భగవంతుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నన్ను తీసుకెళ్లొచ్చు అంటూ యోగ్‌రాజ్ సింగ్ తెలిపారు.
నా జీవితంలో నేను ఎక్కువగా బాధపడింది యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నమ్ కౌర్ నన్ను విడిచి వెళ్లినప్పుడు. నేను ఎవరి కోసం నా జీవితాన్ని అంకితం చేశానో ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను అందర్నీ బాగా చూసుకున్నాను.. కానీ, నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆ దేవుడిని అడిగాను. నేను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. కానీ, ఎవరికీ కీడు మాత్రం చేయలేదు. వృద్ధాప్యంలో నాకు ఎవరూ తోడుగా లేరు.. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను అంటూ యోగ్‌రాజ్ సింగ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
యోగ్‌రాజ్ సింగ్ షబ్నమ్ కౌర్ ను తొలి వివాహం చేసుకోగా.. వారికి యువరాజ్ సింగ్, జోరవర్ పుట్టారు. వారిద్దరూ విడిపోయిన కొద్దికాలంకు యోగ్‌రాజ్ సింగ్ నీనా బంధెల్ అలియాస్ సత్బీర్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే, వారుకూడా యోగ్ రాజ్ నుంచి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వారు అమెరికాలో ఉంటున్నారు.
ఇటీవల యువరాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి యోగరాజ్ సింగ్, తల్లి షబ్నమ్ సింగ్ లకు విడాకుల ఆలోచనను సూచించింది తానేనని చెప్పారు. నాకు 14ఏళ్లు లేదా 15 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో మా ఇంటిలో అమ్మ నాన్న తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఇంటి వాతావరణంలో జీవించడం చాలా కష్టంగా మారింది. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు వారి మధ్య గొడవలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఆ సమయంలో నేను వారిద్దరినీ విడిపోవాలనే ఐడియా ఇచ్చాను. ఏదేమైనా వారిద్దరూ చివరికి విడిపోయారు అంటూ యువరాజ్ చెప్పుకొచ్చాడు.
