Old Apple Computer : ఆపిల్ అభిమాని అంటే.. ఇట్లుంటది మరి.. ముంబై స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్‌కు 1984 ఆపిల్ కంప్యూటర్ను తీసుకొచ్చాడు..!
Old Apple Computer : అభిమానం అంటే.. ఇదే భయ్యా.. ఆపిల్ కంపెనీపై ఓ అభిమాని ఇలా చూపించాడు. ముంబై స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్‌కు 1984 ఆపిల్ కంప్యూటర్ను తీసుకొచ్చాడు..!

Apple Fan Brings 1984 Computer To Mumbai Store's Grand Opening
Old Apple Computer : ప్రపంచ ఐకానిక్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో ఫస్ట్ ఫిజికల్ రిటైల్ స్టోర్ (First retail store) ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) గేటులు ఓపెన్ చేసి కస్టమర్లకు వెల్కమ్ చెప్పారు.
ముంబై ఆపిల్ స్టోర్ ప్రారంభానికి ముందే చాలా గంటల నుంచి ఆపిల్ అభిమానులు స్టోర్ వెలుపల భారీగా క్యూ కట్టేశారు. ఆపిల్ అభిమానుల్లో ఒకరు మాత్రం.. 1984 నాటి పాతకాలపు ఆపిల్ కంప్యూటర్ ముంబై స్టోర్‌కు తీసుకొచ్చాడు. అప్పట్లో ఈ పాత ఆపిల్ కంప్యూటర్ కొన్నానని చెప్పాడు. అంతేకాదు.. ఆపిల్ ప్రయాణాన్ని చూపించడానికి మాత్రమే ఈ కంప్యూటర్ తీసుకువచ్చానని తెలిపాడు.
1984లో ఈ ఆపిల్ కంప్యూటర్ కొనుగోలు చేశానని, అప్పటి నుంచి ఆపిల్ కొత్త ప్రొడక్టులను ఉపయోగిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ కంప్యూటర్ పాతకాలం నాటిది అయినా 2 మెగాబైట్స్ కలిగిన బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ అని తెలిపాడు. కానీ, ఇప్పుడు ఆపిల్ 4K, 8K, రిజల్యూషన్ డిస్ప్లేలను తయారు చేస్తోంది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆపిల్ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చిందని అభిమాని చెప్పుకొచ్చాడు.
ఆపిల్ మెగా స్టోర్ డోర్స్ ఈరోజు ఉదయం 11 గంటలకు తెరుచుకున్నాయి. అయితే, ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి ముందే చాలా గంటల ముందు అభిమానులు స్టోర్ వద్ద బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే నిలబడి ఉన్నానని అభిమాని తెలిపాడు. ముంబై వంటి పెద్ద నగరంలో ఆపిల్ మరో స్టోర్ ఓపెన్ చేయాలని ఆపిల్ అభిమానులు కోరుతున్నారు. ఆపిల్ రెండవ స్టోర్ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది.

Apple Fan Brings 1984 Computer To Mumbai Store’s Grand Opening
ఐఫోన్ తయారీదారు ఆపిల్ 2023లో భారత మార్కెట్లో 25 ఏళ్లకుపైగా విజయోత్సం జరుపుకుంటోంది. దేశంలోనే తన మొదటి రెండు స్టోర్లతో మరింత విస్తరణ దిశగా కంపెనీ అడుగులు పడుతున్నాయని కంపెనీ తెలిపింది. ఈ వారంతో ఆపిల్ భారత్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో మొదటి ఆపిల్ స్టోర్ ప్రారంభించింది.
ముంబై, ఢిల్లీలోని రెండు స్టోర్లు భారత సంస్కృతికి అనుగుణంగా ఉంటాయని ఆపిల్ తెలిపింది. భారత్ చాలా అందమైన సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. దేశంలో ఆపిల్ దీర్ఘకాల చరిత్రను నిర్మించడానికి చాలా సంతోషిస్తున్నామని సీఈఓ టిమ్ కుక్ అన్నారు. భారత్ నుంచి ఆపిల్ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 బిలియన్ డాలర్లు దాటినట్లు అంచనా.