EPFO 3.0 : బిగ్ అలర్ట్.. జూన్‌లో కొత్త EPFO 3.0 వస్తోంది.. యూపీఐ నుంచి ఏటీఎం విత్‌డ్రా వరకు కీలక మార్పులివే..!
EPFO 3.0 : ఈపీఎఫ్ఓ కొత్త ప్లాట్‌ఫామ్ EPFO 3.0 త్వరలో ప్రారంభించనుంది. ఈ కొత్త సిస్టమ్ కింద జరగబోయే కొన్ని కీలక మార్పులు ఏంటంటే?

EPFO
EPFO 3.0 : పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. వచ్చే జూన్ నుంచి ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త ప్లాట్‌ఫామ్ EPFO 3.0ను ప్రారంభించనుంది.
ఈపీఎఫ్ఓ 3.0 సభ్యులకు బ్యాంకు మాదిరి సర్వీసులను అందించే లక్ష్యంతో ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త వ్యవస్థ జూన్ నుంచి అమలులోకి రానుంది.
ఇకపై పీఎఫ్ చందాదారులు బ్యాంకు అకౌంట్ లాగా ఏటీఎం నుంచి ఈపీఎఫ్ డబ్బును నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 కింద జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులకు సంబంధించి వివరాలను ఓసారి తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభ తేదీ :
ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్‌ఫామ్ అధికారికంగా జూన్ 1, 2025న ప్రారంభం కానుంది. ఈ తేదీని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ధృవీకరించారు. మే, జూన్ 2025 మధ్య ప్రారంభమవుతుందని ప్రకటించారు.
పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ చాలా సులభతరం అవుతుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ఆటోమేటిక్ అవుతుంది. ఇకపై మాన్యువల్ క్లెయిమ్ చేయాల్సిన పని ఉండదు.
ఏటీఎం విత్‌డ్రా :
ఇప్పుడు మీ క్లెయిమ్ చేసిన వెంటనే.. బ్యాంకు అకౌంట్ మాదిరిగానే ఏటీఎం నుంచి మీ డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. జూన్ నుంచి పీఎఫ్ చందాదారులు యూపీఐ లేదా ఏటీఎం ఆధారిత ఛానెల్‌ల ద్వారా తక్షణమే రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
డిజిటల్ కరెక్షన్ :
మీ ఇంటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో మీ అకౌంట్ సమాచారాన్ని చాలా సులభంగా మార్పులు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకించి ఫారమ్ నింపాల్సిన అవసరం ఉండదు.
ప్రభుత్వ పథకాలతో ఇంటిగ్రేషన్ :
ఈపీఎఫ్ఓ 3.0 అనే కొత్త సిస్టమ్ ఆధారంగా అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన (PMJJBY) వంటి ప్రభుత్వ పథకాలను కూడా చేర్చాలని పరిశీలిస్తోంది.
OTP ఆధారిత ధృవీకరణ :
మీరు OTP ద్వారా వేగంగా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. పీఎఫ్ చందాదారులు తమ కాంటాక్టు వివరాలు, పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చు.
ఈ కొత్త ప్రాసెస్ కోసం OTP ఆధారిత ధృవీకరణ అవసరం. ఈపీఎఫ్ఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ డాక్యుమెంటేషన్ హార్డ్ కాపీలను కూడా సమర్పించాల్సిన అవసరం ఉండదు.
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS) :
ఈపీఎఫ్ఓ ఇటీవలే పెన్షనర్ల కోసం సెంట్రలైజడ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS)ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ద్వారా పెన్షనర్లు ఇప్పుడు దేశంలోని ఏ బ్యాంకు శాఖ నుంచైనా తమ పెన్షన్‌ను ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
హెల్త్ (ESIC) సర్వీసులు :
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కూడా హెల్త్ సర్వీసులను అప్‌గ్రేడ్ చేస్తోంది. త్వరలో ESIC లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్, ఛారిటబుల్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు.