కారణమేంటి: గూగుల్ క్విజ్‌లో అందరూ పాల్గొనాల్సిందే

టెక్ జెయింట్ గూగుల్ ఇటీవల వినియోగదారులకు ఓ క్విజ్ ముందుంచింది. ఇందులో ఓ మాదిరి చదువు తెలిసిన వారెవరైనా పాల్గొనవచ్చు. దీని ప్రధాన ఉధ్దేశ్యం గూగుల్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని బలపరచడం. ఈ రోజుల్లో హ్యాకింగ్ చాలా సులువైపోయింది. ఒకప్పుడు బడాబాబుల డేటాను దొంగిలించడానికి, విలువైన సమాచారాన్ని కొట్టేయడానికి మాత్రమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు. ప్రస్తుత పరిస్థితులు దిగజారి సాధారణ జీవితం గడిపే వారి వివరాలను సైతం కాజేసే దుస్థితి నెలకొంది.
మెయిల్ ఐడీను సేకరించిమార్కెటింగ్ మెయిల్స్ పంపడంతో మొదలవుతుంది అసలు కథ. రోజూ మెయిళ్లను ఏదో రకంగా పంపుతుంటారు. ఏదో ఒక రకంగా వినియోగదారుడిని మభ్యపెట్టి సదరు వ్యక్తి పంపే మెయిల్‌పై క్లిక్ చేయించడమే వారి టార్గెట్. ఇలా క్లిక్ చేయడంతో పాస్ వర్డ్‌ను సులువుగా హ్యాక్ చేసేయొచ్చు. దీనినే ఫిషింగ్ పద్ధతి అంటారు. ఈ మెయిల్స్‌లో మీ ఇన్ బాక్స్ ఖాళీ లేదని అందులో డేటాను డిలీట్ చేయాలని వచ్చే మెయిల్స్ కొన్ని ఉంటే, మీ పాస్ వర్డ్‌ను ఎవరో దొంగిలించారు వెంటనే మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అంటూ వచ్చే మెయిల్స్ కొన్ని ఉంటాయి.
వీటన్నిటిపై అవగాహన కలిగేందుకు గూగుల్ ఓ క్విజ్ మనముందుకు తెచ్చింది. అందులో పాల్గొనడం ద్వారా ఏది ఫిషింగ్(హ్యాకింగ్ మెయిల్), ఏది సాధారణ మెయిల్ అనేది తెలుసుకోవచ్చు.
ఇక మన మెయిల్ హ్యాక్ కాకుండా ఉండేందుకు మరో పద్ధతిని ప్రవేశపెట్టింది గూగుల్. అదే 2టైమ్ వెరిఫికేషన్. కేవలం పాస్ వర్డ్ ఉంటే సరిపోదు. దాంతో పాటు ఫోన్‌కు వచ్చే కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మెయిల్ ఓపెన్ కాదు. దీంతో పాటుగా మరో క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను మార్కెట్లో పెట్టింది. లింక్ కొట్టగానే ఓపెన్ అయింది గూగుల్ పేజీనా లేదా ఫేక్ పేజీనా అనే సంగతి తెలియజేస్తుంది.