Domains Name: ఇండియా పేరు మారిస్తే.. .IN డొమైన్ వెబ్‌సైట్ల పరిస్థితి ఏంటి?
ఇండియా పేరు మారిస్తే .IN డొమైన్‌లను ఉపయోగించే వెబ్‌సైట్ల పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రభుత్వ అధికార పోర్టల్లతో పాటు ఎన్నో ప్రైవేటు వెబ్‌సైట్లు కూడా .ఇన్ డొమైన్‌లతో పనిచేస్తున్నాయి.

India to be renamed Bharat If it happens how to change domain name
India Domains Name: ఇండియా పేరును అధికారికంగా భారత్ గా మార్చేందుకు మోదీ సర్కారు రెడీ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈమేరకు కేంద్రం తీర్మానం చేయనుందని ఊహాగానాలు మొదలయ్యాయి. జీ20 సదస్సు (G20 Summit) నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఇవ్వనున్న డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొనడంతో ఈ ఊహాగానాలకు ఊతం లభించింది. ఇండియా పేరును భారత్ గా మారుస్తారన్న దానిపై అధికార, విపక్షాల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశం పేరు మారిస్తే వివిధ రంగాలపై పడే ప్రభావంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఇండియా పేరు మారిస్తే .IN డొమైన్‌లను ఉపయోగించే వెబ్‌సైట్ల పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రభుత్వ అధికార పోర్టల్లతో పాటు ఎన్నో ప్రైవేటు వెబ్‌సైట్లు కూడా .ఇన్ డొమైన్‌లతో పనిచేస్తున్నాయి. .IN అనేది దేశం పేరును సూచిస్తుంది. సాంకేతిక పరిభాషలో దీనిని ccTLD (country code Top Layer Domain)గా పేర్కొంటారు. ఇండియాకు సంబంధించిన వెబ్‌సైట్లన్నీ .IN డొమైన్‌లను కలిగివుంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఎవరైనా డాట్ ఇన్ డొమైన్ తో వెబ్‌సైట్ కావాలనుకుంటే registry.in నుంచి పొందవచ్చు. INRegistryని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NIXI) నిర్వహిస్తుంది.
కొత్త డొమైన్ పేర్లు ఏంటి?
ఒక్కో దేశానికి ఒక్కో డొమైన్ నేమ్ (ccTLD) ఉంటుంది. .CN అనేది చైనా వెబ్‌సైట్లను సూచిస్తుంది. అమెరికా పోర్టల్లకు .US అని ఉంటుంది. .UK అనేది బ్రిటీషు వెబ్‌సైట్లకు సంబంధించినది. ఇండియా పేరును భారత్ గా మారిస్తే కొత్త డొమైన్ పేర్లు ఎలా ఉంటాయన్న చర్చ టెక్ వర్గాల్లో నడుస్తోంది. .BH లేదా .BR అనేవి సూటవుతాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రెండు డొమైన్లు బహ్రెయిన్, బ్రెజిల్ దేశాలకు వెబ్‌సైట్లకు వాడుతున్నారు. .BT డొమైన్ భూటాన్ పోర్టల్లకు వినియోగిస్తున్నారు. ఒకవేళ ఇండియా పేరును అధికారికంగా భారత్ గా మారిస్తే వాటి ccTLD మన దేశానికి ఇవ్వమని కోరవచ్చు లేదంటే .BHARAT లేదా .BHRT వంటి అదనపు TLDలను తీసుకోవచ్చని టెకీలు సూచిస్తున్నారు.
Also Read: వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ అదిరిందిగా.. టాప్ బార్ డిజైన్ ఇదేనట.. అందరికి కనిపిస్తుందా?
పేరు మారినా నో ప్రాబ్లమ్..
ఇండియా పేరు మార్చినా .IN డొమైన్‌లను ఉపయోగిస్తున్న వెబ్‌సైట్‌లకు ఎటువంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. అవి ఇప్పటికీ ఇంటర్నెట్‌లో కనిపిస్తాయని, వాటికి ఎప్పటిలాగే కనెక్ట్ అవ్వొచ్చని స్పష్టం చేస్తున్నారు. అయితే భారత్ గా మారిన తర్వాత డొమైన్ పేరు కూడా మారుస్తారా, ఉన్నదాన్నే కొనసాగిస్తారా అనేది తేలడానికి సమయం పడుతుంది. అప్పటివరకు .IN డొమైన్‌లతో పనిచేస్తున్న వెబ్‌సైట్‌లకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని వెల్లడవుతోంది.