Viral Video: ఎవడ్రా వీడు? ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడేంటి? కోటిన్నర లంబోర్గిని కారును రూ.1.5 లక్షలతో తయారుచేసిన కుర్రాడు 

"ఇతడే లంబోర్గినికి అసలైన పోటీదారు" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: ఎవడ్రా వీడు? ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడేంటి? కోటిన్నర లంబోర్గిని కారును రూ.1.5 లక్షలతో తయారుచేసిన కుర్రాడు 

Updated On : July 10, 2025 / 4:46 PM IST

లంబోర్గిని కారులో షికారు చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ దాని ధర కోట్లలో ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవడానికి కేరళకు చెందిన 26 ఏళ్ల బిబిన్ ఒక విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు.

పాత కార్ల భాగాలు, స్క్రాప్ మెటల్‌తో తన కలల కారైన లంబోర్గిని హురాకన్‌ను స్వయంగా తయారు చేశాడు. కేవలం రూ.1.5 లక్షల ఖర్చుతో, మూడేళ్ల కష్టంతో అతను సాధించిన ఈ అద్భుతం ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ కారును ఎలా తయారు చేశాడు? ఆ వివరాలు చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

పగలు ఉద్యోగి.. రాత్రి ఆవిష్కర్త రూపందాల్చి..
పగటిపూట క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో ఉద్యోగం చేసే బిబిన్.. రాత్రుళ్లు కారును తయారు చేయడానికే సమయాన్ని వెచ్చించేవాడు. కారును ఎలా తయారు చేశాడో యూట్యూబ్ లో తెలిపాడు. చూడ్డానికి అచ్చం లంబోర్గినిలా ఉండే ఈ కారును అతను ఎలా తయారుచేశాడో చూడండి..

ఇంజిన్, వీల్స్‌ను పాత మారుతి సుజుకి ఆల్టో కారు నుంచి తీసుకున్నాడు. పనికిరాని మెటల్ షీట్లు, ఫైబర్‌గ్లాస్‌తో బాడీ వర్క్ చేశాడు. గాల్లోకి లేచే డోర్ల (Butterfly Doors)ను  అమర్చాడు.

కార్ జాక్, వైపర్ మోటార్ సాయంతో పనిచేసే “నోస్ లిఫ్ట్ సిస్టమ్”ను కూడా ఏర్పాటు చేశాడు. బటన్ నొక్కితే కారు ముందు భాగం పైకి లేస్తుంది. ల్యాంబోర్గినీ స్టైల్ స్టీరింగ్ వీల్‌ను అమర్చాడు.

ఈ ప్రాజెక్ట్ కోసం అతను మూడేళ్లపాటు తన సమయాన్ని, శక్తిని వెచ్చించాడు. ఇప్పటివరకు అయిన ఖర్చు కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే. బిబిన్ యూట్యూబ్ వీడియో చూసిన నెటిజన్లు అతని పట్టుదల, సృజనాత్మకతకు ఫిదా అయ్యారు. కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు:

“ఇతడే లంబోర్గినికి అసలైన పోటీదారు” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “వావ్! స్క్రాప్‌ను ఒక కళాఖండంగా మార్చాలంటే అసలైన టాలెంట్, ప్యాషన్ ఉండాలి. నీకు సెల్యూట్ బ్రదర్” అని ఒకరు అన్నారు.

“ఇది మైండ్‌సెట్‌కు సంబంధించిన విషయం. కొనలేని వాడు తయారుచేస్తాడు. నువ్వు ఒక ఇన్‌స్పిరేషన్” అని మరో యూజర్ కామెంట్ చేశాడు. బిబిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంకా ఇంటీరియర్స్, సీట్ల కుషన్ వంటి 20-30% పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులన్నీ పూర్తయ్యాక, ఈ దేశీ లంబోర్గిని రోడ్లపై పరుగులు పెట్టనుంది.

కేరళలో ఇలాంటి ఆవిష్కరణలు కొత్తేమీ కాదు. ఇటీవల, 67 ఏళ్ల వృద్ధుడు స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు కూడా వైరల్ అయ్యింది. ఆ కారు కేవలం రూ.5 కరెంట్ ఖర్చుతో (ఒక్క యూనిట్) 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.