భారీగా పెరగనున్న టీవీల ధరలు.. త్వరగా కొనేసుకోండి..!

భారీగా పెరగనున్న టీవీల ధరలు.. త్వరగా కొనేసుకోండి..!

Updated On : January 15, 2021 / 10:30 AM IST

Prices of TV sets to shoot up this quarter : కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి.. టీవీల ధరలు పెరగబోతున్నాయి. ఈ త్రైమాసికంలో టీవీల ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయంట. కంపోనెంట్ ప్యానెళ్ల ధర అమాంతం పెరిగిపోవడంతో టీవీల ధరలను పెంచాలనే యోచనలో ఉన్నాయి. 2020 ఏడాదంతా ఎక్కువగా ఇళ్లల్లోనే ఉన్నవారంతా కొత్త బిగ్ స్ర్కీన్ టీవీలను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. టీవీల ధరల పెంపుతో టెలివిజన్ తయారీ రంగంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీవీ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్లు, నిపుణుల ప్రకారం.. ఓపెన్ సెల్ డిస్ ప్లే ప్యానెల్ ధర ఒక్కసారిగా పెరిగిపోయాయని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల కొరత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడంతో వీటి ధర అమాంతం పెరిగిపోయాయి.

ఇతర ముడిసరుకుల ధరలు కూడా పెరిగాయి. దాంతో కంపెనీలపై తయారీ ఖర్చు భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు వినియోగదారులపై ధరల భారాన్ని పెంచడం తప్ప మరొక దారిలేదంటున్నాయి. కొన్ని నెలల క్రితమే 32 అంగుళాల టీవీ ప్యానెళ్ల ధర 33 డాలర్ల నుంచి 35 డాలర్లకు పెరిగాయి. ప్రస్తుతం ప్యానెళ్ల ధర 60 డాలర్ల నుంచి 65 డాలర్లకు పెరిగిపోయింది. వెండర్లు పెద్దమొత్తంలో చెల్లించేందుకు రెడీగా ఉన్నప్పటికీ ప్యానెల్ పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదు.

మార్కెట్లో అవరోధాల కారణంగా ఎలక్ట్రానిక్స్ ధర 20శాతం నుంచి 30శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ఆధారిత ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ దైవా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అరుణ్ బజాబ్ తెలిపారు. ఇప్పటికే భారత టీవీ మార్కెట్లో షియామీ, శాంసంగ్, వన్ ప్లస్ టీవీ బ్రాండ్ల ధరలు 10శాతం నుంచి 15 శాతం పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో మాత్రం ఇన్ పుట్ ధరలు మాత్రం పెరిగినట్టు కనిపిస్తోంది. అందులో ఎక్కువగా టీవీ తయారీకి అవసరమైన ఓపెన్ సెల్ ఫ్యానెళ్ల ధర భారీగా పెరిగిపోయాయి. తద్వారా టీవీల ధరలను కూడా పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.