స్మార్ట్ వాచ్‌ల నుంచి స్మార్ట్ రింగ్స్‌కి.. అప్‌గ్రేడ్ అవుతున్న జనాలు.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలూ ఇవే వాడుతున్నారు.. ఎందుకంటే?
రాత్రంతా చేతికి వాచ్ పెట్టుకోవడం కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. అదే స్మార్ట్ రింగ్స్ చేతి వేలికి పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ అసౌకర్యాలేమీ ఉండవు.

స్మార్ట్ వాచెస్ ట్రెండ్ ముగుస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్ రింగ్స్ కనపడుతున్నాయి. వజ్రాలు, రత్నాల ఉంగరాల కంటే ఇవే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. వీటిని ఎందుకు ఇంతలా వాడుతున్నారు? సినీ, పొలిటికల్, స్పోర్ట్స్ సెలబ్రిటీల చేతి వేళ్లకి ఈ రింగ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? వీటి వల్ల ఏమేం ఉపయోగాలు ఉన్నాయి?
ఇవి మనం చేతి వేళ్లకు పెట్టుకునే చిన్న ఉంగరంలా ఉండడం, ఆరోగ్య రక్షణ కోసం అవసరమైన డేటాను ఇవి ఇస్తుండడం వంటి ఎన్నో పనులు చేస్తున్నాయి. మొన్నటి వరకు యాపిల్ వాచ్‌లను వాడారు చాలా మంది. యాపిల్ వాచ్ చాలా మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడింది.
ఇప్పుడు జనాలకు యాపిల్ వాచ్ కూడా సరిపోవట్లేదు. డేటా ఇవ్వడంలో అది కాస్త వెనుకబడ్డట్లు భావిస్తున్నారు. రాత్రంతా చేతికి వాచ్ పెట్టుకోవడం కాస్త అసౌకర్యంగా అనిపిస్తోంది. అదే స్మార్ట్ రింగ్స్ చేతి వేలికి పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ అసౌకర్యాలేమీ ఉండవు. నిద్రలోనూ అసలు అంతరాయం కలిగించదు.
స్క్రీన్ ఉండదు, అలర్ట్స్ రావు, నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంది. యాపిల్ వాచ్ లాగా రోజూ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. స్మార్ట్ రింగ్స్ కొన్ని రోజులపాటు నడుస్తాయి. మనం స్నానానికి వెళ్లే సమయంలో ఛార్జ్ పెడితే చాలు.
ఈ స్మార్ట్ రింగ్ మనకు సంబంధించిన హెల్త్ డేటాను అందిస్తుంది. అది కూడా సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా. ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. నిద్ర నాణ్యత, గుండె రేటు మార్పులు, శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలు, బాడీ రికవరీ, సోషల్ జెట్‌ల్యాగ్ వంటి అంశాలను ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతోంది.
Also Read: ఒక్క రోజు కూడా పని చేయకుండా కంపెనీ నుంచి రూ.26 లక్షల శాలరీ తీసుకున్న యువకుడు.. ఎలాగంటే?
స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ స్మార్ట్ రింగ్ విటమిన్ డీని కూడా ట్రాకింగ్ చేస్తుంది. స్కిన్ టోన్, వయసు, లింగం, ఆ సమయానికి ఉన్న యూవీ ఇండెక్స్ ఆధారంగా సూర్యరశ్మి ఏ సమయాల్లో పొందితే మంచిదో సూచిస్తుంది. యాపిల్ వాచ్‌లతో పోలిస్తే స్మార్ట్ రింగ్స్ బాగా పనిచేయడమే కాకుండా సౌకర్యవంతంగా ఉంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్మార్ట్ రింగ్స్ చూపిస్తున్న శరీర టెంపరేచర్ డేటా కచ్చితత్వంతో ఉంటుంది. స్క్రీన్ లేకుండా, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా, మన శరీరం గురించి మనకు చెబుతోంది ఈ స్మార్ట్ రింగ్.
స్మార్ట్ రింగ్ vs స్మార్ట్ వాచ్
ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు స్మార్ట్ డివైస్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్ ట్రాకింగ్, నిద్ర విశ్లేషణ, గుండెకు సంబంధించిన అంశాల మానిటరింగ్ వంటి అవసరాల కోసం స్మార్ట్ వాచ్‌లు ఎంతో మందికి పరిచయమయ్యాయి. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా స్మార్ట్ రింగ్‌లు వేగంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.
- స్మార్ట్ రింగ్‌లు చిన్నవిగా, తేలికగా ఉంటాయి. దీన్ని ఉంగరంలా ధరించవచ్చు. స్మార్ట్ వాచ్‌లు పెద్దగా ఉంటాయి. శరీరానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది.
- స్మార్ట్ రింగ్ బ్యాటరీ 4 నుంచి 7 రోజులు ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్యాటరీ సాధారణంగా 1–2 రోజులకు మాత్రమే సరిపోతుంది.
- స్మార్ట్ రింగ్‌కు స్క్రీన్ ఉండదు. ఇది డేటాను సైలెంట్‌గా సేకరిస్తుంది. స్మార్ట్ వాచ్‌లో స్క్రీన్ ఉంటుంది. నోటిఫికేషన్లు, అలర్ట్‌లు వంటివి ఇస్తుంది.
- స్మార్ట్ రింగ్ ప్రత్యేకంగా ఆరోగ్య, నిద్ర విశ్లేషణపై దృష్టి పెడుతుంది. వాచ్‌లు గ్రాఫిక్స్, మెసేజ్‌లు, కాల్స్ వంటి అదనపు ఫీచర్లతో వస్తాయి.
- స్మార్ట్ రింగ్‌లు కొంచెం ఖరీదైనవే అయినా, వీటిని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేశారు.
స్మార్ట్ రింగ్స్ వాడుతున్న రాజకీయ నాయకులు
ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వంటి నేతలు స్మార్ట్ రింగ్స్ వాడుతున్నారు. వీరే కాదు, చాలా మంది రాజకీయ నాయకులు, ఏ సెలబ్రిటీ చేతికి చూసినా స్మార్ట్ రింగ్స్ కనిపిస్తున్నాయి.