Humanoid Robot Video: రోబో జస్ట్ రూ.5 లక్షలే.. ఇది చేసే పనులు మాత్రం..

చైనాలో వందలాది రోబోటిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అమెరికా కంపెనీలతో పోటీపడుతూ ఆధునిక హ్యూమనాయిడ్ రోబోట్లను అభివృద్ధి చేస్తున్నాయి.

Humanoid Robot Video: రోబో జస్ట్ రూ.5 లక్షలే.. ఇది చేసే పనులు మాత్రం..

Updated On : July 30, 2025 / 12:00 PM IST

అమెరికా టెక్ కంపెనీలు భవిష్యత్‌లో మనుషులకు సేవలు అందించే హ్యూమనాయిడ్ రోబో (మరమనిషి)లను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుండగా, ఇందులో చైనా ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది. చైనా బేస్డ్‌ యూనిట్రీ రోబోటిక్స్ సంస్థ ఇప్పటికే రూ.5 లక్షల ధరతో “ఆర్1” అనే తాజా మోడల్ హ్యూమనాయిడ్ రోబోట్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది.

“ఎక్స్”లో తాజాగా ఆ సంస్థ ఇందుకు సంబంధించిన ఈ వీడియోను పోస్ట్ చేసింది. “ఆర్1” రోబోట్ కార్ట్వీల్ వేయడం, చేతులపై నడవడం, పంచులు ఇవ్వడం, పడుకుని మళ్లీ లేవడం, కొండపైంచి పరిగెత్తడం వంటి నైపుణ్యాలను ప్రదర్శించింది. దీని బరువు సుమారు 25 కిలోలు, ఎత్తు సుమారు నాలుగు అడుగులు.

Also Read: గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. 12 పెట్టెల్లో రూ.11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం..

క్లిష్టమైన పనులను చేసేందుకు “లార్జ్ మల్టీ మోడల్”తో దీన్ని అభివృద్ధి చేశారు. దీని లోపల నాలుగు మైక్రోఫోన్లను అమర్చారు. వైఫై 6, బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీకి సపోర్ట్ చేసేలా ఈ రోబోను రూపొందించారు.

మార్కెట్లో అత్యల్ప ధరకే లభించే హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హ్యాంగ్జౌ కేంద్రంగా ఉన్న ఈ యూనికార్న్ సంస్థ ఇంతకు ముందు రెండు హ్యూమనాయిడ్ మోడళ్లను విడుదల చేసింది. G1 (ఎత్తు 130 సెం.మీ, బరువు 35 కిలోలు), ధర 99,000 యువాన్ (రూ.12,07,883), H1 (ఎత్తు 180 సెం.మీ., బరువు 47 కిలోలు), ధర 650,000 యువాన్ (రూ.79,30,763).

చైనాలో వందలాది రోబోటిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అమెరికా కంపెనీలతో పోటీపడుతూ ఆధునిక హ్యూమనాయిడ్ రోబోట్లను అభివృద్ధి చేస్తున్నాయి. యూనిట్రీ కంపెనీ రోబోట్ ధర $5,900 (దాదాపు రూ.5 లక్షలు) కాగా, హగ్గింగ్ ఫేస్ అనే AI సంస్థ గత నెల “HopeJR” అనే ఓపెన్ సోర్స్, పూర్తి సైజు హ్యూమనాయిడ్ రోబోట్‌ను కేవలం $3,000 (రూ.2,61,847)కే తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికాలోని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధునిక హ్యూమనాయిడ్ రోబోట్ల తయారీపై ఆసక్తి చూపించారు. టెస్లా తయారు చేస్తున్న “ఆప్టిమస్” రోబోట్ మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ, సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తే, దాని ధర $20,000(రూ.17,45,720)లోపు ఉండొచ్చని అంచనా. తుది ధర మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.