Ponnam Prabhakar : కాంగ్రెస్ పథకాలనే కాపీకొట్టి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు..
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను విమర్శించిన బీఆర్ఎస్ నేతలు.. మా పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పథకాలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కాపీ కొట్టారంటూ విమర్శించారు.

Ponnam Prabhakar
Telangana Congress Party Leader Ponnam Prabhakar : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను కాపీకొట్టి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విడుదల చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ సెంటిమెంట్ సభ ప్రసంగంలో పసలేదని ఎద్దేవా చేశారు. 400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్న కేసీఆర్.. 2018 నుండి ఇప్పటివరకు 400 ఫోను మిగతా 800 రూపాయలు తిరిగి చెల్లిస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని పదేళ్లు కాలయాపన చేసిన కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పూర్తి చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని పొన్నం విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందాల్సిన హుస్నాబాద్ ప్రాంతంలోని కొత్తకొండ దేవాలయం, ఎల్లమ్మ దేవాలయం, పొట్లపల్లి, సింగరాయ దేవాలయాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను విమర్శించిన బీఆర్ఎస్ నేతలు.. మా పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పథకాలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కాపీ కొట్టారంటూ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్, డీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు జరగలేదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే. నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. గాలి మాటలు, పొద్దటికో మాట మాపటికో మాట మాట్లాడే కేసీఆర్ 2018లో అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు కూడా అమలు కాని హామీలు ఇచ్చారంటూ పొన్నం విమర్శించారు.
Read Also : CM KCR : దూకుడు పెంచిన కేసీఆర్.. జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు
కాంగ్రెస్ పార్టీ లేకుండా, సోనియా గాంధీ ఇవ్వకుండా తెలంగాణ వచ్చేదా అని ఓసారి గుండె మీద చేయి వేసుకొని కేసీఆర్ చెప్పాలంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంగా ఉన్నారే తప్ప, హుస్నాబాద్ ప్రాంత సమస్యలపై కేసీఆర్‌ను అడుగరు. హుస్నాబాద్ ఉత్సవ విగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మార్చి ఈ ప్రాంత సమస్యలపై గళంవిప్పే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.