తెలంగాణలో కరోనా @ 1001 : GHMC పరిధిలో పెరుగుతున్న కేసులు
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఓ ఆట ఆడుతోంది. వైరస్ కేసులు తక్కువగా నమోదవుతుండడం..మరలా కేసులు అధికం అవుతుండడంతో ప్రజల సంతోషం ఎక్కువ సేపు నిలబడడం లేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఓ ఆట ఆడుతోంది. వైరస్ కేసులు తక్కువగా నమోదవుతుండడం..మరలా కేసులు అధికం అవుతుండడంతో ప్రజల సంతోషం ఎక్కువ సేపు నిలబడడం లేదు. 2020, ఏప్రిల్ 25వ తేదీ శనివారం 7 కేసులు నమోదవుతుండడంతో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని అందరూ భావించారు. కానీ 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం కొత్తగా 11 కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఎక్కడ కేసులు నమోదవుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా GHMC పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతుండడం నగర వాసులు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ కేంద్రాలు ప్రకటించి పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా కేసులు నమోదవుతుండడంతో వైద్యులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 కేసులు నమోదయ్యాయి.
బోడుప్పల్ లో ఓ షాప్ కీపర్ కు, బియ్యం వ్యాపారం నిర్వహించే వ్యక్తికి కరోనా సోకడంతో సర్వాత్రా ఆందోళన పెరిగింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 1001కి కేసులు పెరిగాయి. 660 యాక్టివ్ కేసులున్నాయి. 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 25 మంది చనిపోయారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ..పలు ఆదేశాలు, సూచనలు అందచేస్తున్నారు. పకడ్బంది చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మే 03వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ విధించినా…కానీ తెలంగాణ రాష్ట్రంలో మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.