Queen Elizabeth II: రాణి మెచ్చిన భాగ్యనగరం.. ఆ ఏడాది పెళ్లిరోజు వేడుకలు ఇక్కడే జరుపుకున్న క్విన్ ఎలిజబెత్ దంపతులు
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు భారతదేశంలో మూడు సార్లు పర్యటించారు. రెండవ దఫా వారు దేశంలో పర్యటించినప్పుడు హైదరాబాద్‌లోనూ వారి పర్యటన సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలిజబెత్ దంపతులు భాగ్యనగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు.

Queen Elizabeth II
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు భారతదేశంలో మూడు సార్లు పర్యటించారు. రెండు దఫా వారు దేశంలో పర్యటించినప్పుడు హైదరాబాద్‌లోనూ వారి పర్యటన సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలిజబెత్ దంపతులు భాగ్యనగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజలుసైతం నిర్వహించారు. వీరి పర్యటన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, గవర్నర్ రాంలాల్ వారికి ఘన స్వాగతం పలికారు.
Queen Elizabeth II: బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్న వైనం.. వీడియో
బ్రిటన్ రాణి ఎలిజబెత్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో ఆమెను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాణి దంపతులకు విడిది ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఆమె బీహెచ్ఈఎల్ లో టర్బోమెషినరీ ల్యాబ్ ను ప్రారంభించారు. పటాన్ చెరువులోని ఇక్రిశాట్ లో గ్రామీణులు బతుకమ్మలతో ఎలిజబెత్ రాణికి స్వాగతం పలికారు. రాణి దంపతులు భాగ్యనగరంలో పర్యటిస్తున్న సమయంలో (1983 నవంబర్ 20న) వారి పెళ్లిరోజు. దీంతో వారు బొల్లారం సమీపంలోని ఎంతో ప్రాధాన్యం కలిగిన హోలి ట్రినిటీ చర్చిలో ప్రార్థనలు చేశారు. మేడ్చల్ సమీపంలోని దేవరయాంజల్ గ్రామంలోని సీతారాముల దేవాలయంలో పూజలు నిర్వహించారు.
రాణి దంపతులు భాగ్యనగరం పర్యటన సమయంలో ఆమె వెంట 37 మంది బ్రిటన్ పత్రికా విలేకరులు వచ్చారు. మరో 50 మంది దేశ, విదేశాల జర్నలిస్టులు హైదరాబాద్ కు వచ్చారు. వీరికోసం రిడ్జ్ హోటల్ లో ప్రత్యేకంగా మీడియా సెంటర్ నుసైతం ఏర్పాటు చేశారు.