ఆదిలాబాద్ కాల్పుల కేసులో కొత్త కోణం.. క్రికెట్ గొడవ చిచ్చు పెట్టలేదా ? పాత కక్షలే తాటిగూడ ఘర్షణకు కారణమా ?

Adilabad’s shooting case new angle : తుపాకీ మోత.. బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.. అసలు ఏం జరుగుతుందో తెలియక కాసేపు అక్కడంతా గందరగోళం నెలకొంది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఓ ప్రజాప్రతినిధి.. విచక్షణ కోల్పోయాడు. తుపాకీ, కత్తులతో హల్‌చల్ చేశాడు. చిన్నపాటి గొడవను సదరు నేత పెద్దది చేసి పారేశాడు. ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రజాప్రతినిధి అన్న హోదా పక్కన పెడితే.. అసలు మనిషేనా అన్న రీతిలో ప్రవర్తించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా.. అడ్డొచ్చిన వారిపై కత్తితో దాడికి దిగాడు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ వైఖరితో ఆదిలాబాద్ అదిరిపడింది.
తాటిగూడలో యువకుల మధ్య రేగిన క్రికెట్ చిచ్చు.. చివరకు కాల్పులు, కత్తిపోట్ల వరకు వెళ్లింది. పిల్లల గొడవలోకి పెద్దలు ఎంటరవడంతో.. సీన్ మారిపోయింది. యువకుల మధ్య క్రికెట్ విషయంలో జరిగిన గొడవతో.. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ సహనం కోల్పోయాడు. లైసెన్స్‌డ్ గన్, కత్తితో రెచ్చిపోయాడు. అడ్డొస్తే అంతు తేలుస్తానంటూ వీరంగం సృష్టించాడు. అసలు ఏం జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలీయకుండానే ఫారుఖ్ అహ్మద్ కాల్పులు జరిపాడంటున్నారు స్థానికులు. విచక్షణారహితంగా అహ్మద్ కాల్పులు జరిపిన ఘటనలో.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
జమీర్, మోతేషా, మన్నన్‌లపై ఫారూక్ అహ్మద్ గన్‌తో కాల్పులు చేస్తూనే.. మరో చేత్తో కత్తితో వారిపై దాడికి దిగాడు సదరు ప్రజాప్రతినిధి. ఈ దాడిలో జమీర్, మోతేషాకు బుల్లెట్ గాయాలు కాగా.. మన్నన్ బులెట్ గాయంతో పాటు కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో వారిని వెంటనే హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గురిలో మోతేషా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
ఇక ఇంతటి దారుణానికి ఇక ఈ దారుణానికి కారణమైన అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఘటనకు వెనకాల ఉన్న కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ లైసెన్స్ రద్దు చేశారు. క్రికెట్ మ్యాచ్‌లో తలెత్తిన గొడవే ఈ కాల్పులకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తేల్చినా.. ఘర్షణ వెనుక వేరే కారణాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు ఫారూఖ్‌పై హత్యాయత్నం కేసు, ఐపీసీ సెక్షన్ 307తో పాటు ఆర్మ్‌డ్ యాక్ట్ 27 బై 30 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్పుల ఘటనతో కాలనీతో పాటు ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పట్టణంలో తుపాకీ కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నపాటి గొడవ కాల్పులకు దారితీయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటు ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రికెట్‌లో జరిగిన గొడవే కాల్పులకు కారణమని భావిస్తున్నా.. ఆ ఘర్షణ వెనుక పాత కక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ వారితో అహ్మద్‌కు పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తుండటంతో.. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక తుపాకీ దాడిలో గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. వారిని హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.