Kavitha New Party: కవిత కొత్త పార్టీ ఇదేనా? నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ఇప్పుడు ఆమె వెనుక బీఆర్ఎస్ నేతలు ఎవరైనా నడుస్తారా? లేదా? ఈ పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

Kavitha New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఆమె వ్యవహారశైలి పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తూ పార్టీ సస్పెండ్ చేసింది. ‘ఇటీవల కాలంలో కవిత తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.’ అని బీఆర్ఎస్ రిలీజ్ చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది?
కాంగ్రెస్ లో చేరతారా?
బీఆర్ఎస్ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే చర్చ జరుగుతోంది. అయితే, తాము కవితను తీసుకోబోమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కవిత సస్పెన్షన్ తర్వాత ఆయన 10టీవీతో మాట్లాడారు. తాము కవితను తీసుకోబోమని స్పష్టం చేశారు.
బీజేపీలో చేరతారా?
కవిత ముందున్న మరో ఆప్షన్ బీజేపీ. ఆమె కమలం పార్టీలో చేరతారా? అంటే అవకాశం లేదనే చెప్పాలి. బీజేపీ తనను జైల్లో పెట్టిందని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే టైమ్ లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన వస్తే తానే వద్దని చెప్పానని గతంలో కవిత తెలిపారు. కాబట్టి, ఆమె బీజేపీలో చేరే అవకాశం లేదు.
కవిత సొంత పార్టీ పెడతారా?
కవిత సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఏ పార్టీలో చేరే అవకాశం లేదని.. డైరెక్టుగా కొత్త పార్టీనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కవిత వెనుక నడిచేదెవరు?
బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు ఆమె వెనుక బీఆర్ఎస్ నేతలు ఎవరైనా నడుస్తారా? లేదా అనే చర్చ ఉంది. దానికి ఇప్పుడే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోవైపు తనకంటూ సొంతంగా తెలంగాణ జాగృతి ఉంది. జాగృతికి సంబంధించిన నేతలే ప్రస్తుతం ఆమె బలం.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా?
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత .. బీఆర్ఎస్ ఇచ్చిన పదవిలో కొనసాగుతారా? లేదా?. ఆమె బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునే ఉద్దేశం క్లియర్ గా ఉంటే ఆమె పదవికి రాజీనామా చేయొచ్చని అంటున్నారు. మరోవైపు బీజేపీలో గెలిచిన రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె కూడా అలాగే ఎమ్మెల్సీగా కొనసాగుతారా? లేదా అనేది చూడాలి