Bandi Sanjay On Violence
Bandi Sanjay On Violence : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. ఇది ఆవేశపూరిత చర్య కాదన్న ఆయన.. ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం జరిగిన దాడి అని స్పష్టమవుతోందన్నారు. ఆర్మీ పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రశాంతంగా నిరసన తెలపాలనుకున్నారు.. కానీ, వారి ముసుగులో కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించాయని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ విధ్వంసకాండను పసిగట్టడంలో, నిరోధించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. వేల మంది స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఆర్మీ అభ్యర్థుల మాటున దుండగులు పెట్రోల్ బాటిళ్లు, ఐరన్ రాడ్లు తీసుకొచ్చి స్టేషన్ లోకి ప్రవేశించినా పోలీస్ వ్యవస్థ ఎందుకు గుర్తించకలేపోయింది? ఇన్ని వేల మంది ఏకధాటిగా దాడి ఎలా చేస్తారు? అన్ని విషయాల్లో ముందస్తుగానే నివేదికలిస్తూ హెచ్చరించే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు? అని బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.(Bandi Sanjay On Violence)
మొత్తంగా ఈ ఘటన పూర్వాపరాలను చూస్తుంటే ఈ విధ్వంసకాండకు ఎవరు సహకరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఒకవైపు భారత దేశంలో అద్భుతమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను కేంద్రం తీర్చిదిద్దిందన్నారు. వందల కోట్ల రూపాయలతో స్టేషన్ ను ఆధునీకరించిందన్నారు. అలాంటిది.. గంట వ్యవధిలో స్టేషన్ మొత్తం ధ్వంసమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువకులను రెచ్చగొట్టిందెవరు? వారి వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలి? అని బండి సంజయ్ అన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కడుపు మండి విధ్వంసం చేస్తున్నారంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దుర్మార్గం అని బండి సంజయ్ మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గౌరవెల్లి బాధితులు సహా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపట్ల కూడా కడుపు మండి ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Agnipath : అప్పుడు అన్నదాతలతో..ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్
ఈ ఆందోళనకు, ‘అగ్నిపథ్’ స్కీంకు సంబంధం ఉందని నేను అనుకోవడం లేదన్నారు బండి సంజయ్. దేశభక్తి ఉన్న యువకులు భరతమాతకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించే గొప్ప పథకం ‘‘అగ్నిపథ్’’ అని బండి సంజయ్ అన్నారు. ఆర్మీలో చేరాలనుకునే యువకులకు ఇదొక గొప్ప వరం అని చెప్పారు. ఈ విధ్వంసానికి, అగ్నిపథ్ స్కీంకు ముడిపెట్టి మాట్లాడటం సిగ్గు చేటు అని విమర్శించారు.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించింది. అయితే, ఈ స్కీమ్ అగ్నిగుండాన్ని రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
తాజాగా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఆందోళనలు పాకాయి. పెద్దఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో వరంగల్ కు చెందిన ఓ యువకుడు మృతిచెందగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ తో సహా పలు రైల్వే స్టేషన్లు మూసివేశారు. హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను నిలిపివేశారు.