Dubbak Constituency : బై పోల్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? దుబ్బాకలో ప్రజలు పట్టం కట్టేది ఎవరికి
Dubbak Constituency Politics : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు "నీకు నాకు సై" అంటున్నారు.

Dubbak Constituency Political Scenario Neeku Naaku Sye
రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు. డిసెంబర్ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు. వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.
తెలంగాణలో బీజేపీకి ఊపిరిపోసిన గడ్డ..
దుబ్బాక నియోజకవర్గం.. తెలంగాణలో బీజేపీకి ఊపిరిపోసిన గడ్డ.. గతంలో కాంగ్రెస్‌ను గుండెల్లో పెట్టుకున్నారు ఇక్కడి జనం. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరొకరు సిట్టింగ్ ఎంపీ. ఇంకొకరు ప్రజా నాయకుడి తనయుడు బరిలో ఉన్నారు. దీంతో దుబ్బాక రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
దుబ్బాకలో ఎవరి వ్యూహం ఫలిస్తుంది?
బై ఎలక్షన్ రిజల్ట్ రిపీట్ చేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ధీమాగా ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనావాస్‌రెడ్డి ప్రజాబిడ్డగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సంక్షేమమే సక్సెస్ మంత్ర అంటూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సైలెంట్‌గా జనంలోకి దూసుకెళ్తున్నారు. మరి దుబ్బాకలో ఎవరి వ్యూహం ఫలిస్తుంది. అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు.?
Also Read : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?
కుటుంబ పాలనను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారు- రఘునందన్‌రావు
దుబ్బాకలో మళ్లీ కమలం జెండా ఎగరడం ఖాయమంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఇప్పటికే నూరు ఊర్లు తిరిగేశానని ప్రతి పల్లె కమలం వైపు చూస్తుందన్నారు రఘునందన్‌రావు. తెలంగాణ ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గంపై నిర్లక్ష్యం చేసిందన్నారు. తాను కొట్లాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.
అభివృద్ధే ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ అభ్యర్థి ముందుకు
సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా.. అభివృద్ధే ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా ఇదే విజయ మంత్రాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. సొంత గడ్డను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి.. ప్రతి మడికి నీళ్లు అందిస్తానంటున్నారు. కత్తి దాడి తర్వాత డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పినా.. నియోజకవర్గ ప్రజల్ని కలుస్తూ, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
32వేల మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ అభ్యర్థి ధీమా
తెలంగాణ ఆకాంక్షను బీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందంటున్నారు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి. బీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదంటున్నారు. మల్లన్నసాగర్ బాధితులను కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటుమని చెబుతున్నారు. మంత్రిగా తన తండ్రి చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారాయన. దుబ్బాక గడ్డపై 32వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.
Also Read : మహేశ్వరంలో ట్రయాంగిల్ ఫైట్.. సబిత ఓటమి ఖాయమంటున్న ప్రత్యర్థులు
మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు “నీకు నాకు సై” అంటున్నారు.