Bandi Sanjay: ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్
ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi sanjay fire on congress government over fee reimbursement dues
- కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ ధ్వజం
- రూ.15 వేల కోట్ల బకాయిలు
- విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ చెలగాటం
Bandi Sanjay; రాష్ట్రంలో నాన్-పేమెంట్, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది పేద, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక కళాశాలలకు నిధులు విడుదల చేయడం చేతగాని ప్రభుత్వం, విదేశీ విశ్వవిద్యాలయాలను తీసుకువస్తామని ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
రూ. 15 వేల కోట్ల బకాయిలు:
రాష్ట్రంలో దాదాపు రూ. 15 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల సుమారు 40 లక్షల మంది ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. బకాయిలు అందకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీనివల్ల విద్యార్థులు పైచదువులకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) ద్వారా బకాయిలు తీరుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ “లడాయి” దీక్షకు సంపూర్ణ మద్దతు:
ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేపట్టిన ‘‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’’ దీక్షకు బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కళాశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ. 15 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, ప్రజా సంఘాల మద్దతుతో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
