Corona Telangana: బీ కేర్‌ఫుల్.. 95 శాతం ‘డెల్టా’ వేరియంట్ కేసులే!
దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసులతో పోలిస్తే తెలంగాణలో కరోనా సాధారణంగా ఉన్నట్లే లెక్క. కేసుల ఉదృతి అంతగా లేకపోగా.. మరణాలు కూడా స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే, రాష్ట్రంలో నమోదయ్యే కేసులను పరిశీలిస్తే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసులలో ఎక్కువశాతం డెల్టా వేరియంట్ కేసులేనని నివేదికలో తేలింది.

Corona Telangana
Corona Telangana: దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసులతో పోలిస్తే తెలంగాణలో కరోనా సాధారణంగా ఉన్నట్లే లెక్క. కేసుల ఉదృతి అంతగా లేకపోగా.. మరణాలు కూడా స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే, రాష్ట్రంలో నమోదయ్యే కేసులను పరిశీలిస్తే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసులలో ఎక్కువశాతం డెల్టా వేరియంట్ కేసులేనని నివేదికలో తేలింది. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా ఉన్న ఈ రేటు యావరేజ్ గా చూస్తే రాష్ట్రంలో నమోదయ్యే కేసులలో 95 శాతం కేసులు డెల్టా వేరియంట్ కేసులేనని స్పష్టమవుతుంది.
రాష్ట్రంలో జిల్లా వారీగా నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి.. ఆ వివరాలు తాజాగా గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (GISAID)లో పొందుపరిచారు. ప్రతిదేశం నుండి కేసుల వివరాలతో పాటు వేరియంట్ల జీనోమ్ సీక్వెన్సింగ్ ను ఈ డేటాలో అధికారికంగా పొందుపరుస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం నుండి కేసుల వేరియంట్ వివరాలను పొందుపరిచారు. దీనిబట్టి చూస్తే రాష్ట్రంలోని 14 జిల్లాలలో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్ కేసులే కాగా హైదరాబాద్‌లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని కనుగొన్నారు.
ఇక నెలల వారీగా ఈ వివరాలను చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన కేసుల్లో 33 శాతం డెల్టా రకానివి కాగా, అవి మే నెలలో ఏకంగా 84 శాతానికి, జూన్‌లో 86 శాతానికి చేరగా జూలైలో అదికాస్తా 95 శాతానికి చేరింది. దీనిబట్టి ఆగస్టులో ఇది ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు రెండు నమోదవగా ఇది డెల్టా రకంతో పోలిస్తే ప్రమాదకరమా కాదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. దీంతో పాటు.. థర్డ్ వేవ్ వస్తుందా.. ఒకవేళ వస్తే కనుక ఏ రకం వైరస్ విజృంభిస్తుందో కూడా ఇంకా స్పష్టత లేదని వైద్యశాఖ వర్గాలు చెప్తున్నాయి.