Raghunandan Rao : మేమే పంపాం, టీఆర్ఎస్‌లో చేరినా పని చేసేది బీజేపీకే -ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.

Raghunandan Rao : బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లోకి వలస వెళ్తున్న నేతలను తమ పార్టీ వాళ్లే అనుకుని కేసీఆర్ పొరబడుతున్నారని కామెంట్ చేశారు. టీఆర్ఎస్ లో చేరాలని తామే పంపామని మర్చిపోవద్దన్నారు. బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.
”టీఆర్ఎస్ లో చేరిన వాళ్లంతా మా వాళ్లే అని కేసీఆర్ అనుకుంటున్నారు. టీఆర్ఎస్ లో చేరారు, అక్కడే ఉంటారు. కానీ, వాళ్ల మనసు బీజేపీతోనే. రాజుల కాలంలో రాజులు తమ వాళ్లను శత్రు శిబిరంలోకి పంపించే వారు. అదే థియరీ రాజకీయాలకూ వర్తిస్తుంది. బీజేపీని గెలిపించేందుకే వాళ్లు టీఆర్ఎస్ లో చేరారు” అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
బీజేపీలోని ముఖ్య నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నం జోరుగా సాగుతోందన్న రఘునందన్ రావు, ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన నేతలందరూ భౌతికంగా అక్కడున్నా మనసు మాత్రం బీజేపీలోనే ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన నేతలు టీఆర్ఎస్ లో ఉన్నా పనిచేసేది బీజేపీకే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రాజకీయాలు ఎటు పోతున్నాయో ప్రజలు గమనించాలన్నారు. వెయ్యి కోట్లు పంచైనా మునుగోడులో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నచిన్న నాయకులను కూడా పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి ఇద్దరు చొప్పున అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. దాసోజు శ్రావణ్, స్వామి గౌడ్ బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.