BJP Govt Cabinet : మోడీ కేబినెట్‌లోకి బండి సంజయ్ .. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్

మోడీ ప్రభుత్వం ఈ కొత్త సంవత్సరంలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్లుగా పక్కా సమాచారం. కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు మోడీ కేబినెట్ లోకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అవకాశం దక్కనున్నట్లుగా సమాచారం. తెలంగాణ నుంచి బండి సంజయ్ కు మోడీ కేబినెట్ లో చోటు దక్కనున్నట్లుగా సమాచారం.

BJP Govt Cabinet : మోడీ కేబినెట్‌లోకి బండి సంజయ్ .. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్

Updated On : December 31, 2022 / 11:03 AM IST

BJP Govt Cabinet expansion : మోడీ ప్రభుత్వం ఈ కొత్త సంవత్సరంలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్లుగా పక్కా సమాచారం. కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు మోడీ కేబినెట్ లోకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అవకాశం దక్కనున్నట్లుగా సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వంతో బాహాబాహీగా పోరాడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ కు మోడీ కేబినెట్ లో చోటు దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ అధ్యక్ష పదవి ఫిబ్రవరి 10 (2023)న ముగియనుంది. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పుంజుకోవానికి కీలక పాత్ర వహించిన బండి సంజయ్ ను మోడీ కేబినెట్ లోకి తీసుకుంటారని..బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియమితులు అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణపై పట్టుకోసం బీజేపీ కసరత్తులు పక్కా వ్యూహంతో కొనసాగిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా కాకుండా పరిస్థితులను సృష్టించుకుని మరీ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పాత్ర కీలకంగా ఉంది. టీఆర్ఎస్ పైనే కాకుండా సీఎం కేసీఆర్ పాలనపైనా వారి కుటుంబంపై కూడా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతుంటారు బండి సంజయ్.

BJP Government: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కసరత్తు.. జనవరి 14న ముహూర్తం?

దీంతో 2023 జనవరిలో బేజీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు కీలక మార్పులు జరుగనున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం నియమించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2022 జులైలో కేంద్రం విస్తరణ జరిగింది. మరోసారి మోడీ కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణ అధ్యక్షుడు..కరీంనగర్ బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ ను కేబినెట్ లో చోటు కల్పించి అతని స్థానంలో అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొన్ని రాష్ట్రాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.  మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే, ఒకవైపు బీజేపీలోనూ, మరోవైపు ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు చేసేందుకు మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగితే 2024లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీటవేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో తెలంగాణ కూడా ఉంది. దీంతో తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం.

అలాగే బీజేపీ మరింతగా పుంజుకోవటానికి ఇటీవల అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించనుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కొంత మంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చునని బీజేపీలో చర్చ జరుగుతుంది. అలాగే జనవరి 20తో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం ముగియనుంది. దీంతో జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడిగా అవకాశం ఎవరికి దక్కనుందో వేచి చూడాలి.