బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కమలం వైపు చూస్తోన్న ఇతర పార్టీల కీలక నేతలు

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 11:53 AM IST
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కమలం వైపు చూస్తోన్న ఇతర పార్టీల కీలక నేతలు

Updated On : December 5, 2020 / 12:05 PM IST

BJP operation Aakarsh : దుబ్బాకలో గెలిచింది.. జీహెచ్ఎంసీలో సత్తా చాటింది. వరుస విజయాలు తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇదే ఊపుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. కమలంలో జోష్ పెరగడంతో మిగతా పార్టీలకు చెందిన కీలక నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ పెద్దలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ ను సైలెంట్ గా అమలు చేస్తున్నారు.



దుబ్బాకలో అనూహ్య గెలుపు తర్వాత బీజేపీలోకి వలసలు పెరిగాయి. ఇక గ్రేటర్ ఎన్నికలకు ముందే స్వామి గౌడ్ తోపాటు పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారని గ్రేటర్ ఎన్నికలకు ముందే ఊహాగానాలొచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. గూడూరు నారాయణరెడ్డి, సర్వే సత్యానారాయణ, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు రేస్ లో ఉన్నారు.



ఇక ఉత్తమ్ రాజీనామాతో రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ దక్కనుందనే వార్తలతో ఆ పార్టీలోని కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసిన మరుక్షణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే సూచనలు కనిస్తున్నాయి.

తెలంగాణలో అధికార పార్టీని గట్టిగా ఢీకొడుతున్న బీజేపీ…ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.



స్థానికంగా బలంగా ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకొని వెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే వలసలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస పరిస్థితి అయోమయంగా ఉండటంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ వైపే చాలా మంది చూస్తున్నారు. త్వరలోనే బీజేపీలోకి భారీ స్థాయిలో వలసలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.