జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ.. విచారణ తీరుపై కీలక వ్యాఖ్యలు

మీ విచారణలో నిస్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతుంది.

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ.. విచారణ తీరుపై కీలక వ్యాఖ్యలు

KCR

BRS Chief KCR : తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోంస జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల కొనుగోలుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలోని న్యాయ కమిషన్ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేతకు నోటీసులు జారీ చేసింది. జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో కేసీఆర్ శనివారం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వివరణ ఇచ్చారు. ఈమేరకు 12 పేజీల నోట్ ను కేసీఆర్ పంపించారు. ఈ లేఖలో కమిషన్ విచారణ  తీరుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ వేయకూడదన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేదు. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని మీరుకూడా సూచించకుండా.. బాధ్యతలు స్వీకరించడం విచారకరమని జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశిస్తూ కేసీఆర్ అన్నారు.

Also Read : BRS Chief KCR : కేసీఆర్‎కు నోటీసులు

కేసీఆర్ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయింది. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేది. త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89% ఆంధ్రప్రదేశ్ కు 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ ను వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా ఉండటం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తంగా ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Also Read : BRS Party : హస్తంవైపు వారి చూపు.. మండలిలో త్వరలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా?

విద్యుత్ రంగంలో సంక్షోభంను అధిగమించి, కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు విద్యుత్ కాస్త 20000 మెగావాట్లకు పైచిలుకు చేరుకుందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేసిందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్నితెచ్చి పదేళ్లు పరిపాలించిన నా పేరును విచారణ కమిటీ ప్రస్తావించడం, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీతీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిస్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతుంది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.