KCR HYDRAA : KCR సంచలన వ్యాఖ్యలు.. ‘హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం.. తొలి సంతకం దాని మీదనే’
KCR HYDRAA : జగిత్యాల బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
brs kcr said after returning into power first signature on the file to dissolve HYDRAA in jagtial meeting
KCR HYDRAA : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్నారు. మొదటి సంతకం ఆ ఫైల్ మీదనే పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతు బంధుకు రాంరాం చెప్పారని.. దళిత బంధుకు జై భీమ్ పలికారంటూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవార జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఆయనను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నేను చనిపోవాలని కొందరు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను.పిల్లి శాపాలకు నేను చనిపోతానా.. నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసమే పని చేస్తాను. బీఆర్ఎస్ సభ వల్లే ఇవాళ రెండో విడత రైతు బంధు నిధులు విడుదల చేశారు. మూడో విడత వేయాలంటే మళ్లీ నేను సభ పెట్టాలా అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
‘‘జీవన్‌రెడ్డితో నాకు 45 ఏళ్ల స్నేహం ఉంది. ఆయన కేవలం జగిత్యాల కోసం మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. జీవన్రెడ్డిపి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక.. ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తాను. ఇది నా మాట.. కేసీఆర్ మాట ఇస్తే తప్పడు అని స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. హైడ్రాపై నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్న ఆయన.. మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే పెడతానని స్పష్టం చేశారు. మూసీ నది బాగుచేయాలంటే పదివేల ఇళ్లు కూల్చాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల అన్ని వర్గాల జీవితాలు ఆగమయ్యాయన్నారు. కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి అంటూ పిలుపునిచ్చారు.
