Singareni Scam: గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ నేతలు.. సింగరేణి వివాదంపై ఫిర్యాదు
దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని, దీంతో ఇప్పుడు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
Ktr
- తెలంగాణలో సింగరేణి స్కామ్ దుమారం
- గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ నేతల బృందం
- బొగ్గు గనుల కేటాయింపుల్లో స్కామ్ పై ఫిర్యాదు
Singareni Scam: బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలవబోతున్నారు. సింగరేణి వివాదంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలవబోతున్నారు. బీఆర్ఎస్ నేతల బృందం లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ కాబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు.
సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్..
తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లు, బొగ్గు గనుల కేటాయింపులపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాఫియాకు బొగ్గు గనులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాము ఆరోపించిన తర్వాతే నైనీ బొగ్గు గనుల టెండర్లను రద్దు చేశారని, మిగతా బొగ్గు గని టెంటర్లను సైతం రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని, దీంతో ఇప్పుడు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గవర్నర్ ను కలిసి బొగ్గు గనుల స్కామ్ కి సంబంధించి పూర్తి ఆధారాలను గవర్నర్ కు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధానంగా గవర్నర్ ను కోరబోతున్నారు.
Also Read: మోగిన నగారా.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రేపటి నుంచే
కొత్త విధానం తీసుకొచ్చి పెద్ద స్కామ్..
సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ కి తెరలేపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి పూర్తి స్థాయిలో టెండర్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మిగతా వాళ్లకి కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలకు టెండర్లు దక్కేలా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దాంతోపాటు గతంలో మైనస్ లో టెండర్లు కోట్ చేస్తే ఇప్పుడు ఎక్సెస్ లో టెండర్లు కోట్ చేసి సింగరేణికి నష్టం వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నేరుగా గవర్నర్ ని కలిసి దీనిపై ఫిర్యాదు చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు.
