Bahadurguda Land Row : బహదూర్‌గూడ భూ వివాదంలో రైతులపై కేసులు నమోదు..
Bahadurguda Land Row : బహదూర్‌గూడ భూవివాదంలో పలువురి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Bahadurguda Land Row
Bahadurguda Land Row : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్ గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. శనివారం ఉదయం రెవెన్యూ శాఖ అధికారులు భూములకు ఫెన్సింగ్ వేసేందుకు బహదూర్ గూడ గ్రామంలోని భూముల వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ గత వారం రోజులుగా రైతులు తమ భూములను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇచ్చేది లేదంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. రెవెన్యూ , హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసేందుకు భూముల వద్దకు వెళ్లడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు రైతులు పోలీసులపై దాడికి దిగారు. కారం చల్లి, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
పోలీసులపై దాడికి పాల్పడిన పలువురు రైతులపై ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విధుల్లో ఉన్న అధికారులపై దాడి జరిగిందంటూ శంషాబాద్ రూరల్ ఎస్ఐ వనజ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి పలు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా ఎస్ఐ వద్ద ఉన్న ప్రభుత్వ VHF సెట్ లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జటావత్ రవీందర్, సోమ్లా, జటావత్ కామ్లీ, జటావత్ మణి, పమేనా గాయత్రి, ముదావత్ నీలమ్మ, లిగాని జ్యోతి, దేవేందర్ తదితరులపై BNS సెక్షన్లు 132, 308(2), 121(1) r/w 3(5) కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు.. బహదూర్ గూడ గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్షా శిబిరాన్ని తొలగించిన అధికారులు.. ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్‌గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహరాకాస్తున్నారు.
బహదూర్ గూడలో భూములు కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తమ భూములను ప్రభుత్వం లాక్కొంటోందంటూ సబితా ఇంద్రారెడ్డి వద్ద మహిళా రైతులు బోరున విలపించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె వారికి భరోసానిచ్చారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతుంటూ విమర్శించారు.
