Hyderabad : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి వీధుల్లో నగ్నంగా పరుగెత్తి.. ఆలయంలో మొక్కి.. చెరువు దూకిన యువతి
Hyderabad : హైదరాబాద్ లో యువతి చెరువులో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి నడిరోడ్డుపై నగ్నంగా పరుగెత్తిన యువతి.. ఆ దేవాలయం వద్ద కొద్దిసేపు.. ఆ తరువాత చెరువు దూకి చనిపోయింది.
Hyderabad : హైదరాబాద్‌లో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఉద్యోగ ఒత్తిడి కారణంగా కొంతకాలం క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసిన యువతి, మానసిక సమస్యలతో బాధపడుతూ చివరకు చెరువులో శవంగా కనిపించింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేది. విధుల్లో ఎదురైన తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక సుమారు ఆరు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనంతరం విశాఖపట్టణానికి వెళ్లిన ఆమె, రెండు నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ శంకర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. తండ్రి విశాఖపట్నంలోనే ఉన్నారు.
శుక్రవారం సాయంత్రం వరకు తల్లి, కుమార్తె కలిసి మియాపూర్ ప్రాంతంలో మరో అద్దె ఇల్లుకోసం వెతికారు. అనంతరం రాత్రికి తిరిగి ఇంటికి చేరుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో తేజస్విని నిద్రలేచి, తల్లి ఉన్న గదికి బయట నుంచి తాళం వేసింది. ఇంటి నుంచి నగ్నంగా వీధిలోకి వెళ్లి పరుగెత్తింది. మార్గమధ్యలో స్థానిక బీరప్ప ఆలయం వద్ద కొద్దిసేపు ఆగినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. ఆ తరువాత పీర్జాదిగూడ చెరువు వద్దకు వెళ్లి అందులోకి దూకింది.
ఉదయం నిద్రలేచిన తల్లి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా రాకపోవటంతో గట్టిగా కేకలు పెట్టింది. దీంతో స్థానికులు వచ్చి తలుపులు తీయగా.. కుమార్తె కనిపించకపోవటంతో స్థానికంగా గాలించారు. చివరికి యువతి చెరువులో శవమై కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడేదని పోలీసుల విచారణలో తేలింది.
