ఐవీఆర్‌సీఎల్ అక్రమాలపై సీబీఐ ఫోకస్..ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

CBI focuses on IVRCL company scam : ఐవీఆర్‌సీఎల్ కంపెనీ స్కామ్‌పై సీబీఐ ఫోకస్ పెట్టింది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని బురిడీ కొట్టించినట్లు తేలడంతో దర్యాప్తును వేగవంతం చేసింది. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ అక్రమాలపై సీబీఐ రంగంలోకి దిగిదూకుడు పెంచింది. పలు బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున ఋణాలు తీసుకుని మోసం చేసిన కంపెనీ ఎండీ సుధీర్ రెడ్డి, జేఎండీ బలరామిరెడ్డి పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకకాలంలో ఆరుచోట్ల సోదాలు చేపట్టి కీలక ఆధారాలు సేకరించింది.
ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ కంపెనీ అవసరాల కోసం 4వేల 837 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకుల నుండి ఋణాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఎస్బిఐ, ఐడిబిఐ, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింధ్ బ్యాంక్‌ల నుండి ఋణాలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంక్‌ల నుండి తీసుకున్న ఋణాలు మొత్తం లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇతరులకు నగదు బదిలీ అయినట్లు సీబీఐ గుర్తించింది.
అయితే తీసుకున్న రుణాలతో ఎక్కడ పెట్టుబడుల పెట్టారు, ఆ డబ్బును ఎక్కడికి తరలించారు అన్నదానిపై నిన్న ఎండి,సుధీర్ రెడ్డి, జెడి బాలరామి రెడ్డి నివాసాలపై సోదాలు చేసి వారి ఆర్ధిక లావాదేవీలు వివరాలు సేకరించింది.
సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ రుణాలతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని భావిస్తున్న సీబీఐ.. ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.