హామీలపై మాతో చర్చకు రండి: కేటీఆర్, హరీశ్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్
చివరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని బీఆర్ఎస్ పాలనలో చెప్పుకొచ్చారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన రెండు మ్యానిఫెస్టోలు తీసుకుని చర్చకు రావాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి సెలవు తీసుకోలేదని, అప్పట్లో కేసీఆర్ పదేళ్లలో పదిసార్లయినా సచివాలయంలో కూర్చున్న దాఖలాలు లేవని చెప్పారు. తెలంగాణకు ఎంత వడ్డీ ఉంది? అనేది నెల రోజుల తర్వాత తేలిందని వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను తుంగలో తొక్కారని చెప్పారు.
చివరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని బీఆర్ఎస్ పాలనలో చెప్పుకొచ్చారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలు చెబుతామని తెలిపారు. ప్రధాని మోదీ ట్వీట్‌కి రేవంత్ రెడ్డి స్పందిస్తే, దానికి హరీశ్ రావు ట్వీట్ చేశారని, ప్రభుత్వం మీద అపవాదు వేయడం తప్ప మెరుగైన పాలన అందించేలా సలహాలు ఇవ్వడం లేదని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీకి వడ్డీ మాత్రమే కట్టారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలనను అందించామా లేదా చెప్పాలని నిలదీశారు. అసలు టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ కోసం పెట్టలేదని, కలెక్షన్లు.. కమిషన్లు దండుకోవడానికి పెట్టారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వెంటనే వీటిపై రివ్యూలు చేయాలి: హరీశ్ రావు