Bhagyalaxmi Temple: భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ పై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి..
హైదరాబాద్ పరిధిలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నిర్వహణపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం ప్రకటించింది.

Bhagyalaxmi Temple
Bhagyalaxmi Temple: హైదరాబాద్ పరిధిలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నిర్వహణపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం ప్రకటించింది. భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 110 పేజీల తీర్పు వెలువరించింది. తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. టెంపుల్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ సూచించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చార్మినార్ అమ్మవారి దేవాలయం పరిధిలో 1960లో బస్సు ప్రమాదం జరిగింది. అప్పట్లో అమ్మవారి విగ్రహం డ్యామేజ్ అయింది. అయితే, స్థానిక భక్తులు డొనేషన్లు వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత అమ్మవారిని పోచమ్మగా కాకుండా భాగ్యలక్ష్మీగా పిలుచుకుంటున్నారు. అప్పటి నుంచి భాగ్యలక్ష్మీ టెంపుల్ గా పేరుగాంచింది. కాగా, రాంచంద్ర దాసు శిష్యుడు రాజ్ మోహన్ దాస్ అనే వ్యక్తి కూడా హెరిడిటరీ ట్రస్టు ద్వారా ఈ టెంపుల్ పై అజామాయిషీ చలాయిస్తున్నాడు. అయితే, మహంత్ రాంచంద్ర దాసు కూతురుగా చెప్పుకుంటున్న మహిళ భాగ్యలక్ష్మీ టెంపుల్ పై అజామాయిషీ చలాయిస్తున్న వారిపై కోర్టుకు వెళ్లారు. దీంతో ఆమెకు, రాజ్ మోహన్ దాసుకు మధ్య వివాదం నడుస్తుంది.
భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు ప్రతీయేటా దాదాపు రూ.12కోట్లు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా కోర్టు కేసులకోసం వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తీర్పు ఇవ్వడంతోపాటు.. వెంటనే ఈవోను నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.