YS Jagan : సార్ ఎలా ఉన్నారు.. కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్.. గంటకుపైగా ఇరువురి మధ్య చర్చలు
గతనెల కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

YS jagan
BRS Chief KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. సీఎం జగన్ ను తోడ్కొని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. సీఎం జగన్ కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఉన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య గంటకుపైగా సమావేశం జరిగింది. ఇరువురి నేతలు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలో తాజా రాజకీయాలపై వీరి మధ్య సుదీర్ఘంగా చర్చజరిగినట్లు సమాచారం. కేసీఆర్ తో సమావేశం ముగిసిన తరువాత సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లారు.
Also Read : YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం.. షర్మిలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్
ఇదిలాఉంటే గతనెల కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీని విజయవతంగా పూర్తి చేశారు. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్.. ఈనెల 15న బంజారాహిల్స్ నందినగర్ లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
తెలంగాణ భవన్ లో బుధవారం లోక్ సభ ఎన్నికలకోసం బీఆర్ఎస్ నియోజకవర్గాల సమీక్ష ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఈనెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి వస్తారని, రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారని, తెలంగాణ భవన్ నుంచికూడా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు.