అసెంబ్లీలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలి : కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్ష జరిపారు.. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
ఎన్ని రోజులు సమయం పట్టినా కూడా ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాల్సిందేనన్నారు. అందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నారు. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించే విషయంలో మంత్రులంతా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్ని అంశాలపై సంపూర్ణ సమాచారంతో రెడీగా ఉండాలని ఆదేశించారు.
ప్రజాస్వామ్య విలువలకు తగినట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరగాలని ఆకాంక్షించారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలని కోరారు. పథకాలు, చట్టాల అమలపై కూడా సభ్యులు విశ్లేషించాల్సిందిగా కోరారు. పథకాలు, చట్టాల అమల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే శాసన సభ్యులు లేవనెత్తాలని సూచించారు.
సభ్యులడిగే ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం సమాధానమిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో అల్లర్లు, దూషణాలు, తిట్లు, శాపనార్థాలు సరికాదన్నారు.. పనికిమాలిన నిందలు, అసహనం ప్రదర్శించేందుకు అసెంబ్లీ వేదిక కాకుండా సజావుగా జరగాలని కోరుతున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లు హాజరయ్యారు.