భారత్ బంద్‌కు సీఎం కేసీఆర్ మద్దతు… బంద్‌లో పాల్గొనాలంటూ కార్యకర్తలకు పిలుపు

CM KCR support Bharat Bandh : రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ కు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటాన్ని సమర్థించారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ప్రకటించారు.
ప్రజలు బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించే వరకూ పోరాటం కొనసాగించాలన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల పోరాటం కొనసాగుతోంది. నిన్న 35 రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఐదో దఫా చర్చలు నిర్వహించగా.. అవి ఎటూ తేలకుండానే ముగిశాయి. రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో కేంద్రం చర్చలను డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకి వాయిదా వేసింది. డిసెంబర్ 9న నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తామని కేంద్రం చెప్పింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల సమయంలో వ్యవసాయ చట్టాల రద్దుపై ఎస్, నో చెప్పాలంటూ రైతులు మౌన ప్రదర్శన నిర్వహించారు.
కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. 45 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినా… అందులో 94 శాతం పంటలకు మద్దతు ధర రావడం లేదని రైతులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మద్దతు ధరకన్న తక్కువ ధరకు కొనుగోలు చేసేవారిని అరెస్ట్ చేసి ఐదేళ్లు జైలులో ఉంచి కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఐదో దఫా చర్చలు అర్దాంతరంగా ముగియడంతో ముందుగా ఈ నెల 8న పిలుపునిచ్చిన భారత్ బంద్‌ను కొనసాగించాలని రైతు సంఘాలు ఫిక్స్ అయ్యాయి. బంద్‌ను వాయిదా వేయాలని కేంద్రం కోరగా.. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని, సవరణలకు అంగీకరించమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఇటు రైతుల ఆందోళనలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అనేక రాష్ట్రాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.
భారత్ బంద్ ప్రశాంతంగా నిర్వహించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. అన్నదాతలకు ఢిల్లీ ప్రభుత్వం సహకరిస్తుండటంతో హస్తిన వీధుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్రం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. ఇటు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు రోడ్ల మీదనే ఉంటామని రైతులు చెబుతున్నారు. ఆరు నెలలు అయినా సరే ఇలాగే నిరసన చేస్తామని తేల్చి చెప్పారు. ఈ ఆరు నెలలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు సమకూర్చుకుంటున్నారు. రైతులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అండగా నిలుస్తున్నాయి.