Mohammed Ali Shabbir : కేసీఆర్ ఎక్కడా గెలవరు, కామారెడ్డి ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది- షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
చరిత్రలో ఓ పొరపాటు చేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్.. ఇక్కడ అక్కడ.. ఎక్కడా గెలవరు. కేసీఆర్ ను ఓడగొట్టి ఇంటికి పంపుతారు. Mohammed Ali Shabbir - CM KCR

Mohammed Ali Shabbir - CM KCR (Photo : Facebook, Google)
Mohammed Ali Shabbir – CM KCR : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు మీదున్నారు. అందరికన్నా ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేశారు గులాబీ బాస్. కాగా, ఈసారి కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. అదే సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు కేసీఆర్.
మొత్తంగా రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా స్పందించారు.
”సీఎం కేసీఆర్.. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తారని తెలిసింది. చరిత్రలో ఓ పొరపాటు చేస్తున్నారు కేసీఆర్. కామారెడ్డి గడ్డపై పుట్టిన వ్యక్తిని నేను. కామారెడ్డి ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. కేసీఆర్ ను ఓడిస్తారు. ముస్లిం, మైనార్టీ లీడర్ అని చూసి నాపై పోటీ చెయ్యాలని చూస్తున్నారు. కేసీఆర్.. ఇక్కడ అక్కడ.. ఎక్కడా గెలవరు. కేసీఆర్ ను ఓడగొట్టి ఇంటికి పంపుతారు.
కామారెడ్డి అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైనార్టీ డిక్లరేషన్ కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్ గా నన్ను వేశారు. ఇవ్వాళ కమిటీ సభ్యులతో డిక్లరేషన్ పై చర్చించాం. ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీలు కూడా హాజరయ్యారు.
Also Read..BRS List: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్
మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చింది. కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పి చెయ్యలేదు. కనీసం మైనార్టీ విభాగాన్ని బలోపేతం చెయ్యలేదు. అధికారులు కూడా లేక నిర్వీర్యం అవుతోంది. ముస్లిం డెవలప్ మెంట్, వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం ఏం చెయ్యాలని డిస్కస్ చేశాం. కమిటీలో కొన్ని వినతిపత్రాలు వచ్చాయి. వాటిపై మరోసారి డిస్కస్ చేస్తాం” అని షబ్బీర్ అలీ అన్నారు.