CM Revanth Reddy: అందుకే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ నేతలు చెబుతున్న మాటలు నమ్మకూడదని రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకుపోయిన కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ పరిస్థితి వెనుక కేసీఆర్ ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోయినందుకే కుప్పకూలిందని తెలిపారు. టన్నెల్‌లో ఎనిమిది మంది మృతి చెందడానికి కేసీఆరే కారణమని అన్నారు.
వనపర్తిలో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయనను నమ్మినందుకే పాలమూరు కూడా నష్టపోయిందని చెప్పారు. పాలమూరు రైతు బిడ్డను తాను ముఖ్యమంత్రిని అయితే చూసి ఓర్వలేకపోతున్నారని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు.
మహిళలు ఆశీర్వదిస్తే తాను మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని తెలిపారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు మళ్లిస్తోందంటే అందుకు కేసీఆరే కారణమని చెప్పారు. అప్పట్లో 811 టీఎంసీల్లో 511 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లాలని కేసీఆర్ సంతకం చేశారని తెలిపారు. అదే ఇప్పుడు మన రైతలకు శాపంగా మారిందని చెప్పారు.
బీజేపీ నేతలు చెబుతున్న మాటలు నమ్మకూడదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుతవ్ంపై బీజేపీ, బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో పథకాలు అమలు చేయడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. అలాగే, రైతు భరోసా డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేశామని తెలిపారు. తెలంగాణపై కిషన్ రెడ్డి పగబట్టారని, అందుకే అక్కసు వెళ్లగక్కుతున్నారని చెప్పారు.