సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, లక్ష్యం ఇదే..
ఒకవైపు జిల్లా స్థాయిలో పరిపాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన పార్టీలోని కేడర్ ను, లీడర్ ను ఏకం చేసేలా పని చేస్తున్నారు ముఖ్యమంత్రి.

Cm Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుంటూ పరిపాలనపై మరింత పట్టు పెంచుకునేందుకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఓవైపు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రతిరోజు అధికారులతో శాఖల వారిగా సమీక్షలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం నుంచి మారుమూల పల్లె వరకు తన మార్క్ పాలన ప్రజలకు చూపించేందుకు అడుగులు వేస్తున్నారు.
జిల్లా పర్యటనలతో స్థానిక పరిస్థితులు తెలుసుకునేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనలకు వెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇలా ఒకవైపు జిల్లా స్థాయిలో పరిపాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన పార్టీలోని కేడర్ ను, లీడర్ ను ఏకం చేసేలా పని చేస్తున్నారు ముఖ్యమంత్రి. అధికారిక కార్యక్రమాల తర్వాత పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలతో పార్టీలోని నేతలు సమన్వయంతో నడుచుకునేలా సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ లబ్దిదారుడికి చేరేలా, ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పెరిగేలా పని చేయాలని కేడర్ టు లీడర్ కు టాస్క్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి.
Also Read : ఓటరుతో పాటు క్యాడర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే..! ఎందుకో తెలుసా..