TGSRTC Stirke: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు, అందుకే ఒకసారి ఆలోచించండి- ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి.

TGSRTC Stirke: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందుకే సమ్మెపై ఒకసారి ఆలోచన చేయాలని కార్మికులను కోరారు రేవంత్ రెడ్డి. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందని తేల్చి చెప్పారు.
”గత పదేళ్లలో ఎంతో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు. మీ కోసమే ఖర్చు చేస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. అందుకే ఒకసారి ఆలోచించండి.
కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. పదేళ్లు ఏమీ చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి. నమ్ముకున్న మీకు అండగా ఉంటా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు దిగాలను ఆర్టీసీ కార్మికులు నిర్ణయించుకున్నారు. మే 7 నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెకి సంబంధించిన పోస్టర్‌ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆవిష్కరించింది. మే డే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జేఏసీ డిమాండ్ చేసింది.
Also Read: కరీంనగర్ కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. కలహాల కాపురానికి కారణం అదేనా?
నిరవధిక సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే 5న కార్మిక కవాతు చేపట్టనుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు సమ్మెకు మద్దతుగా యూనిఫామ్‌లో కార్మికులు కవాతు నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పంతాలకు పోవద్దని ఆయన కోరారు.