కాంగ్రెస్‌లో కరీంనగర్ కలహాల కాపురానికి కారణం ఇదేనా?
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు..నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Minister Ponnam Prabhakar
మేమింతే…మాకెవ్వరూ చెప్పాల్సిన అవసరంలేదు..మా పార్టీలో మేం తన్నుకుంటాం..కొట్టుకుంటాం..అంతా మా ఇష్టం..వుయ్ డోంట్ కేర్.! ఇదీ కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతల తీరంటూ రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు రోజు రోజుకి రచ్చకెక్కుతున్నాయంట. పదవుల కోసం ఇంకా నిరసన గళాలు, అసంతృప్తి రాగాలు విన్పిస్తూనే ఉన్నాయి.
అసలే కలహాల కాపురంగా సాగుతున్న హస్తం పార్టీలో..నేతలు బాహబాహికి దిగి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారట. అయితే పార్టీలో అసంతృప్తి, నిరసనలకు ఓ మంత్రి వ్యవహరమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు ఆయన వ్యతిరేఖ వర్గీయులు. ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అంతర్గత విభేధాలు వీడడంలేదు. కరీంనగర్ జిల్లాలో పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావాలా మారి పోయిందట. పెద్ద దిక్కు లేక పోవడంతో అంతర్గతో పోరు బహిర్గతం అవుతోంది. అధికార పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి కలిసిమెలిసి ఉండాల్సిన నాయకులు..కొట్లాటలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కన్పిస్తోంది.
నాయకుల మధ్య సఖ్యత లోపించడంతో వారంతా వర్గాలుగా విడి పోతున్నారు. ఎవరి వర్గం వారన్నట్లుగా వ్యవహరిస్తున్నప్పటికి..ప్రధానంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వర్గాలుగా కరీంనగర్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది నాయకులు మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేస్తున్నారన్న కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయంశంగా మారాయి.
నరేందర్ రెడ్డి, మంత్రి పొన్నంకు మధ్య గ్యాప్
కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ షిప్ట్ అయి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. సిద్దిపేట జిల్లా మంత్రి అయినప్పటికి..హుస్సాబాద్ నియోజకవర్గంలో కొంతభాగం కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండడంతో పొన్నం తన సొంత జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడాన్ని ఓవర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సుడా చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మంత్రి పొన్నంకు మధ్య గ్యాప్ ఉందనేది ఓపెన్ సీక్రెట్.
అలాగే ఎప్పటినుంచో పొన్నం ప్రభాకర్ కు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారదకు మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు ఉన్న క్యాబినెట్ ర్యాంకును కూడా నేరేళ్ల శారదకు పొన్నం కారణంగానే తొలగించారనే విమర్శలు ఆమె వర్గీయుల నుంచి విన్పిస్తున్నాయి. పొన్నంకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యేతో ఇప్పుడు పొసగడంలేదట. తన నియోజకవర్గంలో మంత్రి జోక్యాన్ని సదరు ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందట.
ఇక కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న పురమళ్ళ శ్రీనివాస్..ఏకంగా పొన్నం టార్గెట్ గా చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు గొడవలకు దారితీస్తున్నాయట. నామినేటేడ్ పదవులను భర్తీ చేయకుండా, ఏ పనులు జరగకుండా ఓ వ్యక్తి హైదరాబాద్ లో అడ్డుకుంటున్నాడంటూ పొన్నం ప్రభాకర్ ను ఉద్దేశించి పురమల్ల శ్రీనివాస్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు డీసీసీ ఆఫీసులో రచ్చకు దారి తీశాయట.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధం ఉన్నా లేకున్నా ఆయన వ్యతిరేకుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగి పోతుందట. పార్టీని బలోపేతం చేయడంలోనూ..క్యాడర్ లో సఖ్యత కుదర్చడంలోను విఫలమయ్యరనే టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. నామినేటేడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా అవి దక్కక పోవడంతో మంత్రినే బాధ్యుడిని చేస్తూ విమర్శిస్తున్నారు.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు..నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో బీజేపీ..మరింత బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంటే..అధికార కాంగ్రెస్ మాత్రం కలహలతోనే కాలాన్ని గడిపేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలను విమర్శించాలని చెప్పే పార్టీనే..ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిపోతున్న తీరును చూసి కాంగ్రెస్ గడపలో అడుగు పెట్టడానికి కొత్తతరం ఆలోచిస్తుందట.