CM Revanth Reddy : 15రోజుల్లో కోదండరాంను మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా.. ఎవరు అడ్డొస్తారో చూస్తా.. సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ ఉస్మానియాకు వెళ్లారు.

CM Revanth Reddy
CM Revanth Reddy : ఉస్మానియా యూనివర్శిటీకి ఎంతో చరిత్ర ఉంది.. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్శిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ ఉస్మానియాకు వెళ్లారు. ఈ సందర్భంగా పలు భవనాలను ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటి..? ఢిల్లీ వరకు వెళ్లి కోదండరామ్ పై కుట్రలు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను 15రోజుల్లో చట్టసభలకు పంపుతా.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉస్మానియా యూనివర్శిటీ పదం, తెలంగాణ పదం అవిభక్త కవలలు. తెలంగాణ ఉద్యమ పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ. ఉస్మానియా యూనివర్శిటీలో శివరాజ్ పాటిల్ నుంచి పీవీ నర్సింహారావు వరకు చదివిన వారే. దేశ, రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్న ప్రముఖ నాయకులు ఉస్మానియా యూనివర్శిటీ బిడ్డలేనని సీఎం రేవంత్ అన్నారు.
ఒక జార్జ్ రెడ్డి – గద్దర్ లను అందించిన గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ. తెలంగాణ సమాజానికి సమస్య, సంక్షోభం వచ్చిన సమయాల్లో మొదటి చర్చ ఉస్మానియా యూనివర్శిటీలోనే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి మరో పోరాటాన్ని నేర్పిన నేల ఉస్మానియా యూనివర్శిటీ. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాధించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్శిటీ అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, క్యాన్సర్ లెక్క కొద్దికొద్దిగా ఉస్మానియా యూనివర్శిటీని నిర్వీర్యం చేసే కుట్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైస్ ఛాన్సిలర్లను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఉద్యమంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని పట్టించుకోలేదు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరుడయ్యాడు. శ్రీకాంత చారి అమరుడైనందుకు ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. యాదయ్య తెలంగాణకోసం అమరుడయ్యాడు. ఇలా ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కానీ, వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లపై పరోక్షంగా రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం పోయిందన్న ఆవేదన ఉంటది. కొడుకును ఏదో చేద్దాం అనే ఆలోచనలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను చదివింది.. పెరిగింది తెలంగాణలోనే. నేను చదువుకోవడానికి గుంటూరు పోలేదు. మా తాతలు, తండ్రులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా లేరు. నేను చెట్టుపేరు మీద చింతకాయలు అమ్ముకునే రకం కాదు. మా మంత్రులు, నేను ప్రజలకు అందుబాటులో ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఏనుగులు, సింహాలు లేవు. తెలంగాణలో మానవ రూపంలో మృగాలు ఉన్నాయి. అవి ఫామ్ హౌస్‌లో ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీలలో ఏనుగుల పేరుతో అడ్డుకున్నారు. మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తే.. ఉస్మానియా యూనివర్శిటీని ఉండనివ్వరు.. ఉస్మానియా యూనివర్శిటీని లే ఔట్‌లు చేసి అమ్ముకుంటారు. మళ్లీ డిసెంబర్ 9వ తేదీన సభ పెట్టండి.. నేను వచ్చి ఉస్మానియా యూనివర్శిటీకి ఏం కావాలో ఇచ్చి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.