Dharani : మన రైతుల డేటా ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాలకు వెళ్లిపోయింది- సీఎం రేవంత్ రెడ్డి

దేశ సరిహద్దులు దాటిపోయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన సమాచారం వెళ్లిపోయింది..

Dharani : మన రైతుల డేటా ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాలకు వెళ్లిపోయింది- సీఎం రేవంత్ రెడ్డి

Updated On : December 20, 2024 / 7:25 PM IST

Dharani : ధరణిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. ధరణి ద్వార తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుల సమాచారాన్ని ఇతర దేశాలకు దాటేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. భూముల రక్షణ కోసం గత ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. భూములను రక్షించేందుకే ధరణిని తీసుకొస్తున్నామని కేసీఆర్ చెప్పారని, ధరణి ద్వారా కేసీఆర్, కేటీఆర్ భూములను రక్షిస్తారని అనుకున్నామని రేవంత్ అన్నారు. కానీ, అందుకు భిన్నంగా ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాలకు మన రైతుల సమస్త సమాచారం చేరిందన్నారు.

భూ యజమానుల హక్కులు కాపాడేందుకు భూ భారతి బిల్లును తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని భావించామన్నారు. ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందని ముఖ్యమంత్రి రేవంత్ ధ్వజమెత్తారు.

”ధరణి వెబ్ సైట్ కావొచ్చు, సాంకేతిక అద్భుతం.. కేసీఆర్ సొంతంగా కనిపెట్టిందో లేక కేసీఆర్ సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏమీ కాదు. వారు మెదడును అంతా రంగరించి ఒక అద్భుతాన్ని, ఒక అమృతాన్ని తీసి అందులోంచి సృష్టించిన ధరణి.. వాళ్ల ఆలోచన అని చెప్పారు. అది శుద్ద తప్పు. 2010లోనే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ.. ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే.. ఒరిస్సా ప్రభుత్వం వాళ్లకు కాంట్రాక్ట్ ఇస్తే.. నాలుగేళ్లు నిర్వహించారు. ఆ తర్వాత కాగ్ నివేదిక తప్పు పట్టింది.

ధరణి పోర్టల్ ను నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలై.. పేర్లు, సంస్థలు, దేశాలు మారుకుంటూ.. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్ కు చేరిందో.. అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్. ఆ దేశంలో నేరం చేసిన ఎవడినీ పట్టుకోలేరు, ఆ దేశం ఎవరికీ వివరాలు ఇవ్వదు. ఇవాళ మన ధరణి పోర్టల్.. ఆర్ధిక నేరాలకు పాల్పడే దేశంలో ఉండే సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణ వివరాలు అక్కడికి వెళ్లిపోయాయి. రైతుల వివరాలన్నీ సీక్రెట్ కోట్ లో ఉండాలి.

ఆ వెబ్ సైట్ ను చూడాలని అనుకున్నా కనిపించకూడదు. కానీ, క్లియర్ గా వారి దగ్గర డేటా ఉంది. రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించిన ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్.. అన్ని వివరాలు.. క్రిస్టల్ క్లియర్ గా వారి చేతిలోకి వెళ్లిపోయాయి. దేశ సరిహద్దులు దాటిపోయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన సమాచారం వెళ్లిపోయింది” అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

‘రైతుల సమాచారం సీక్రెట్ కోడ్ లో ఉండాలి. ధరణి వెబ్ సైట్ నిర్వహించే వారు చూడాలని అనుకున్నా ఆ సమాచారం కనిపించకూడదు. కానీ, క్లియర్ గా వాళ్ల దగ్గర డేటా కనిపిస్తోంది. 2020 నుంచి ఇప్పటివరకు ప్రతి లావాదేవీకి సంబంధించి సమాచారం ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు వెళ్లిపోవడం చాలా తీవ్రమైన నేరం. ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నీ చదవాల్సిన పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కల్పించారు’ అని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : కేటీఆర్ అరెస్ట్‌ జరిగితే బీఆర్ఎస్ ను లీడ్ చేసేదెవరు? కారు స్టీరింగ్‌ ఆ ఇద్దరిలో ఎవరికి..?