నాడు మన్మోహన్ మీకు సహకరించినట్లే.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విన్నపం
నాడు మన్మోహన్సింగ్ ఆశీస్సులు అందించినట్లే మీరు తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందించాలి. భారీ ఆర్థిక వృద్ధి మహా నగరాలు, విశ్వ నగరాల నుంచే వస్తుంది.
Cm Revanth – PM Modi: హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు కానీ తెలంగాణ తగిన ప్రాధాన్యత లభించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ వాపోయారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, ఇక రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడదామని రేవంత్ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలన్నారు. మోదీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి ఎంతో కీలకం అన్న సీఎం రేవంత్.. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహకారం కావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిపై తాము ప్రణాళికలు రూపొందించామని, 2 గంటల సమయం వెచ్చింది రివ్యూ చేయాలని ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్.
తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి..
ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాదు అభివృద్ధి ఉత్సవం అని ఆయన అన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మనకు అత్యధిక ప్రాధాన్యం అని తేల్చి చెప్పారు. ముందు దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించినప్పుడు తాము భాగస్వాములయ్యామని గుర్తు చేశారు రేవంత్. తెలంగాణ రైజింగ్‌కు ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం తమకుందన్నారు.
”తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మోదీ వచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులకు మోదీ వచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడదాం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి సహకరించారు. తెలంగాణకు కూడా మోదీ సహకారం కావాలి. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ విధంగా, ఆయన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా. మీరు అభివృద్ధి పనులు ప్రారంభిస్తే మేము అడ్డుకోము. తెలంగాణ
ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలి..
2034లో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామనే నమ్మకం ఉంది. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆశిస్తున్నా. నాడు మన్మోహన్సింగ్ ఆశీస్సులు అందించినట్లే మీరు తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందించాలి. భారీ ఆర్థిక వృద్ధి మహా నగరాలు, విశ్వ నగరాల నుంచే వస్తుంది. మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు మహా నగరాలున్నాయి. ఈ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలి. ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఉండాలి.
నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారికి సంబంధించి రెండు గంటల పాటు మీరు సమయం కేటాయించి సమీక్షించాలి.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. మీకు పెద్ద మనసు ఉందని చెబుతున్నారు. అది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. వారు దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులు, ప్రతిపాదనలు అన్నింటినీ ఈరోజు మీరు ఆమోదిస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.
దేశం విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. మీరు వికసిత్ భారత్ 2047పై మాట్లాడి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు మేము రాష్ట్ర కోణంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ను దానికి అనుసంధానం చేశాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: హైదరాబాద్ చేరుకున్న మోదీ.. రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
