ఆ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు.. గాంధీభవన్‌లో కార్యకర్తల ఆందోళన

వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అంటున్నారు.

ఆ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు.. గాంధీభవన్‌లో కార్యకర్తల ఆందోళన

Congress Activists Protest : హైదరాబాద్ గాంధీభవన్ లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని నిరసనకు దిగారు. గాంధీభవన్ ఎదుట కూర్చుని బండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అంటూ ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. గద్వాల నియోజకవర్గం అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీభవన్ కు తరలివచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ కార్యకర్తలను అనేక రకాలుగా వేధించారని వారు వాపోయారు. ప్రజల మధ్య ఎన్నో గొడవలు సృష్టించి భయాందోళనకు గురి చేశారని ఆరోపించారు. తమను ఎన్నో ఇబ్బందులు పెట్టిన అలాంటి ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి ఎలా రానిస్తామని కార్యకర్తలు అంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే బండ్లను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే బండ్ల ప్రతి విషయంలో విఫలమైన వ్యక్తి అని అన్నారు. మనుషులను తొక్కేయడం, ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ల కుటుంబాలను దెబ్బతీయడం.. ఇలాంటి పనులు, రాజకీయం చేసే కృష్ణమోహన్ రెడ్డి మాకు వద్దే వద్దు అని గద్వాల కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ల నుంచి మాకు మనశ్శాంతి లేదని వాపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చి సీఎం అయ్యాక తాము కాస్త ఊపిరిపీల్చుకున్నామని గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.

Also Read : మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా.. అడ్డుపడుతున్నది ఎవరు? దేనికోసం?