Jagga Reddy: కార్యకర్తల కుటుంబాలలో ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా ఆదుకుంటా..
కార్యకర్తల కుటుంబాలలో ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా ఆదుకుంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy
Jagga Reddy: కార్యకర్తల కుటుంబాలలో ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా ఆదుకుంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనం ఈ టర్మ్‌లో మూడేండ్లతోపాటు మరో ఐదేళ్లు కూడా అధికారంలో ఉండబోతున్నాం. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో మన పార్టీ అభ్యర్థులే విజయం సాధించాలి. అలాఅని ఎన్నికల్లో గెలవడం కోసం అప్పులు చేయకండి అంటూ జగ్గారెడ్డి సూచించారు.
నా కూతురు వివాహానికి ఆహ్వానం అందిన వారు, అందని వారు అందరూ రండి.. నూతన దంపతులను ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ప్రముఖులుకూడా నా కుమార్తె వివాహానికి హాజరవుతారు. కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటా. మన కార్యకర్తలు, వారి కుటుంబాలు అందరూ బాగుండాలి. ఎవరికి క్యాన్సర్ సమస్య ఉన్నా నేను ఆదుకుంటాను. కార్యకర్తల కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లికి ఆర్థికంగా ఆదుకుంటాను అని జగ్గారెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి వివాహం ఈనెల 7వ తేదీన సంగారెడ్డిలోని రాంమందిర్‌లో జరగనుంది. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని జగ్గారెడ్డి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. గత నెలలో జగ్గారెడ్డి ఆయన సతీమణి నిర్మలా రెడ్డి, కుమార్తె జయారెడ్డి, కుమారుడు భరత్ సాయిరెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. తన కుమార్తె వివాహానికి రావాలని కోరుతూ వివాహ శుభలేఖను రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి దంపతులు అందజేశారు.