అప్పుడే ఖమ్మంలో పోటీ చేయాలనుకున్నా: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

మల్లు భట్టి విక్రమార్క నన్ను వచ్చి ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి.. ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అడుగుతున్నారు. 

అప్పుడే ఖమ్మంలో పోటీ చేయాలనుకున్నా: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

Updated On : April 11, 2024 / 5:28 PM IST

V Hanumantha Rao on Khammam Seat: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం పార్లమెంట్ సీటు కాక రేపుతోంది. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. సీనియర్ నాయకుడితో పాటు ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం ఈ సీటు ఆశిస్తున్నారు. దీంతో ఖమ్మం సీటును ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు.. ఖమ్మం సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

గత ఎన్నికల్లోనే ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్నానని, అందుకే అక్కడి సమస్యలపై పోరాటం చేస్తున్నానని 10tvతో హనుమంతరావు చెప్పారు. ”2019 లోనే నేను ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావించా. రాజీవ్ గాంధీ ఆలోచన మేరకు ట్రైబల్ ఏరియా ఉన్న.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అనుకున్నా. ఖమ్మం నుంచి పోటీ చేయడం కోసం.. అక్కడ ప్రతీ సమస్యపై పోరాటం చేశా.

భట్టి విక్రమార్క నన్ను వచ్చి ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి.. ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అడుగుతున్నారు. సీఎం రేవంత్ మాత్రం.. పార్టీ హైకమాండ్ ఇస్తే కచ్చితంగా నా కోసం పనిచేస్తా అంటున్నారు. నేను.. రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నందున మిగతా నేతలు జీర్ణించుకోవడం లేదు. రాష్ట్రంలో బీసీలకు మూడు ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఎక్కవ సీట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ సోషల్ ఇంజరింగ్ చేయాలి.. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల”ని హనుమంతరావు అన్నారు.

Also Read: ఈ మూడు సీట్లను కాంగ్రెస్‌ ఎందుకు పెండింగ్‌లో పెట్టినట్టు? దీని వెనక కథేంటి?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్‌.. ఖమ్మం సీటు ఆశిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందోనని కాంగ్రెస్ నాయకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.