Addanki Dayakar – Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ని బలి చేయకండి, పవన్‌కు రాజకీయాలు తెలీదు- అద్దంకి దయాకర్
చేగువేరా వారసుడిగా చెప్పుకుంటూ సనాతనం కోసం పాటుపడే వ్యక్తి పవన్. పవన్ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి.
Addanki Dayakar – Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. పవన్ ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇవ్వడం కుదరదని అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇస్తామన్న అద్దంకి దయాకర్.. కుట్రతో పర్మిషన్ అడిగితే అనుమతి ఇవ్వము అని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు, కుట్ర పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా, గతంలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర చేస్తామంటే పర్మిషన్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ ని బలి చేయొద్దని అద్దంకి దయాకర్ కోరారు. పవన్ కల్యాణ్ కి రాజకీయాలు ఏమీ తెలియవన్నారు.
”చేగువేరా వారసుడిగా చెప్పుకుంటూ సనాతనం కోసం పాటుపడే వ్యక్తి పవన్. పవన్ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ తెలంగాణ అని మోదీ అంటే మేం అర్థం చేసుకోలేకపోయాం. మోదీ ఓట్ల మ్యాజిక్ తో గెలవగలరు. ప్రజలను గెలవలేరు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి పవన్. జూన్ 2న పవన్ మీటింగ్ ఎందుకోసం పెట్టారో తెలియదా? బీజేపీ అనుకూల రాజకీయాలు చేసేందుకు బీఆర్ఎస్ స్పాన్సర్ చేస్తున్న కార్యక్రమమే పవన్ మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే పవన్ ను తెరపైకి తెచ్చాయి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా?
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే వాళ్ళు మా వ్యతిరేకులే. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే ఊరుకోము. బీజేపీ నేతలు నల్లి కుంట్లోళ్ళు . తెలంగాణపై ఇంత దాడి జరిగితే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తెలంగాణపై బీజేపీ నిలువెల్లా విషం కక్కుతోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానంటేనే మోదీతో రేవంత్ కలుస్తారు. సుష్మా స్వరాజ్ అంటే మోదీకి ఇష్టం ఉండదు” అని అద్దంకి దయాకర్ అన్నారు.
