ఆర్మూర్‌లో కాంగ్రెస్ దీక్ష..

ఆర్మూర్‌లో కాంగ్రెస్ దీక్ష..

Updated On : January 30, 2021 / 8:45 AM IST

Congress Raitu Deeksha : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఇవాళ కాంగ్రెస్‌ నేతలు భారీ దీక్ష చేయనున్నారు. పసుపు రైతు సమస్యల పరిష్కారానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రాజీవ్‌ రైతు భరోసా దీక్ష తలపెట్టారు. 24 గంటల పాటు జరగనున్న దీక్షతో టీఆర్‌ఎస్‌, బీజేపీలో కలవరం మొదలైందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వరుస ఓటములతో ఢీలాపడ్డ కేడర్‌లో జోష్‌ నింపే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నిర్వహించతలపెట్టింది.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్లతో కాంగ్రెస్ పోరు పట్టింది. పసుపు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన హస్తం పార్టీ నేతలు.. ఇవాళ రాజీవ్‌ రైతు భరోసా దీక్ష చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి.. ఆర్మూర్‌ సభ ద్వారా పసుపు రైతుల్లో భరోసా నింపడంతో.. కేడర్‌లో జోష్‌ నింపనున్నారు.

వేలాది మంది రైతులతో 24 గంటల పాటు రైతు దీక్ష చేయనున్నారు రేవంత్‌రెడ్డి. రెండేళ్ల తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ పార్టీ నేతలు. ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని మైదానం వేదిక పసుపు రైతుల సమస్యలను పరిష్కరిస్తానని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పుడదే వేదిక నుంచి పసుపు రైతు సమస్యలను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు.. కాంగ్రెస్‌ నేతలు దీక్షకు దిగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పసుపు రైతుల జీవితాలతో అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ ఆడుకుంటున్నాయని మధుయాష్కీ మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ అండగా నిలబడడంతో రైతుల్లో నూతనోత్సాహం వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని, పంటకు మద్దతు ధర కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.