telangana schools : కరోనా కలకలం, ఆందోళనల్లో పేరెంట్స్, హాస్టళ్లకు క్యూ
తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు.

Ts Scholl
Corona in Telangana : తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు. పాలమాకుల జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్‌లో 45 మంది విద్యార్థులకు కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. బాధిత విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స్ అందిస్తున్నారు హాస్టల్ నిర్వాహకులు. హాస్టల్‌లో మొత్తం వెయ్యి మంది విద్యార్థులు ఉండటంతో.. కరోనా భయంతో తమ పిల్లలను తీసుకెళ్లేందుకు హస్టల్‌కు క్యూ కడుతున్నారు విద్యార్ధినుల తల్లిదండ్రులు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాఠశాలలు కరోనా హాట్‌స్పాట్‌లగా మారాయి. నిన్న ఒక్కరోజే 102 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జగిత్యాల జిల్లాలో 43 మందికి, సిరిసిల్ జిల్లాలో 32 మందికి, కరీంనగర్‌లో 13 మందికి, పెద్దపల్లిలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. జగిత్యాల బాలిక పాఠశాలలో, సిరిసిల్ల కోనరావుపేట కస్తూర్బా పాఠశాలలో విద్యార్ధులు వైరస్ బారిన పడుతున్నారు. జిల్లాల్లో కరోనా పరీక్షలు పెంచాలని కలెక్టర్లు ఆదేశించారు. పాజిటివ్‌గా తేలిన వారు హోం క్వారెంటెయిన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో రెండు రోజల్లో 48 మంది విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు. భైంసా జ్యతిబాపూలే గురుకుల పాఠశాలలో 34 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాసర ట్రిపుల్ ఐటీలోనూ ముగ్గురు విద్యార్ధులకు కరోనా సోకింది. ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు వైరస్ సోకింది. వీటితో పాటు అనేక పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో పాఠశాలలు వెళ్లేందుకు వారు భయపడుతున్నారు.