కరోనా ఎఫెక్ట్ : సామూహిక సంబురాలకు దూరం…బార్లు, రెస్టారెంట్లు వెలవెల

తెలంగాణలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్‌డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు వెళ్లాలంటే వెనకాడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 08:18 AM IST
కరోనా ఎఫెక్ట్ : సామూహిక సంబురాలకు దూరం…బార్లు, రెస్టారెంట్లు వెలవెల

Updated On : March 14, 2020 / 8:18 AM IST

తెలంగాణలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్‌డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు వెళ్లాలంటే వెనకాడుతున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్‌డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు వెళ్లాలంటే వెనకాడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నప్పటికీ, కళ్యాణ మండపాల్లో  మునుపటి జోష్‌ కనిపించడంలేదని నిర్వాహకులు అంటున్నారు. గతంతో పోల్చుకుంటే శుభకార్యాలకు హాజరయ్యేవారి సంఖ్య 30శాతం వరకు తగ్గిందనేది ఒక అంచనా. 

ఏకంగా ముహూర్తాలు వాయిదా 
మరికొందరు ఏకంగా ముహూర్తాలను వాయిదా వేస్తుండటం విశేషం. పెళ్ళిళ్లకు హాజరవుతున్నవారు సైతం నాలుక రుచులను చంపుకొని, ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకొంటున్నారు. నాన్‌వెజ్‌ వంటకాల జోలికి అసలే వెళ్లడంలేదు. ఫంక్షన్లలో మాంసం వినియోగం సగానికి సగం తగ్గిందని క్యాటరర్లు పేర్కొంటున్నారు. ఫంక్షన్లలోనే కాదు చాలామంది ఇండ్లలోనూ నాన్ వెజ్ వంటకాలు మానేశారంటే ఆశ్చర్యపోవద్దు. 

రెస్టారెంట్లు, బార్లు వెలవెల
హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్ల మీద కూడా కరోనా ప్రభావం పడింది. బయటి ఫుడ్‌కు జనం స్వస్థి చెప్పడంతో రెస్టారెంట్లలో సందడి తగ్గింది. విదేశీ వంటకాలు, చైనీస్‌ ఫుడ్స్‌, పానీపూరీ బండ్ల వద్ద కూడా మునుపటి బిజినెస్‌ కనిపించడం లేదు. మూడు పెగ్గులు ఆరు ఛీర్స్‌గా కిటకిటలాడిన బార్లు కూడా మందుబాబుల తాకిడి తగ్గడంతో వెలవెలబోతున్నాయి. సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య కరోనా దెబ్బతో మరింత తగ్గింది. 

పెరిగిన ఆరోగ్య స్పృహ
మరోవైపు వైరస్‌ పుణ్యామా అని ఆరోగ్య స్పృహ కూడా పెరుగుతున్నది. బయట నుంచి రాగానే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కొంటున్న దృశ్యాలు ప్రతిఇంటిలోనూ కనిపిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడకం పెరిగింది. బయట తిరిగేవారు ముఖానికి రుమాలు చుట్టుకోవడమూ కనిపిస్తున్నది. చల్లని ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న అభిప్రాయంతో చాలామంది ఏసీలు, ఫ్యాన్ల వాడకం తగ్గించి, సురక్షిత జోన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. వర్క్‌ ఫ్రంహోం 
హైదరాబాద్‌లో విదేశీ విద్యార్థుల సంచారం ఎక్కువగా ఉండే ఉస్మానియా వర్సిటీ ఎన్‌సీసీ గేటు తదితర ప్రాంతాల్లో ఇప్పుడు స్థానికుల సందడి తగ్గిపోయింది. ఇక కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులు కార్యాలయానికి రాకుండా వర్క్‌ ఫ్రంహోం విధానాన్ని అనుసరిస్తున్నాయి. హైటెక్‌సిటీలో కొన్ని ఐటీ కంపెనీలు ఇంటినుంచే పనిచేయండని ఉద్యోగులను ఆదేశించాయి. తాము చెప్పేవరకు చైనాకు రావద్దని యాంగ్‌జోహు, వూహాన్‌ మెడికల్‌ యూనివర్సిటీల యాజమాన్యాలు మనదేశంలోని విద్యార్థులకు మెసేజ్ పంపాయి. ఆయా యూనివర్సిటీలు అత్యవసర సిలబస్‌ను వీశాట్‌ ద్వారా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.

Also Read | పజిల్ : ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి