15రోజుల చికిత్సకు రూ.12లక్షల బిల్లు, హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రి దోపిడీ, మృతదేహం మీరే ఉంచుకోండన్న బంధువులు

సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో హస్పటల్ లో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. 15 రోజుల చికిత్సకు రూ.12 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి యాజమాన్యం. అంతడబ్బు చెల్లించలేమని చెప్పటంతో చివరకి శవం ఇచ్చి పంపించారు.
యాదగిరి గుట్టకు చెందిన నవీన్ కుమార్ అనే 28 ఏళ్ళ యువకుడు జూన్ 23న సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరాడు. 24 న అతనికి పరీక్షలునిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. 26 న మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు జూలై 7 మంగళవారం ఉదయం మృతి చెందాడు.
ఆస్పత్రి యాజమాన్యం మొత్తం రూ.12 లక్షలకు బిల్లు ఇచ్చింది. కుటుంబ సభ్యులు అప్పటికే రూ.6.50 లక్షలు చెల్లించారు. మిగిలిన డబ్బు చెల్లించమని ఆస్పత్రి యాజమాన్యం చెప్పటంతో…బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పొలం అమ్మి ఆ డబ్బులు చెల్లించామని …ఇక తమ వద్ద డబ్బులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానోక దశలో డబ్బు లిస్తేనే శవం ఇస్తామని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి.
దీంతో మృతుడి బంధువులు మృతదేహం మీరే ఉంచుకోండని చెప్పారు. చేసేదేమి లేక ఆస్పత్రి యాజమాన్యం మరో రూ.20 వేలు కట్టించుకుని యువకుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు ఇచ్చి పంపించారు. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు.
Read Here>>తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు, ఏడుగురు మృతి