ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు…ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు జరుపనున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 05:37 PM IST
ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు…ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated On : March 29, 2020 / 5:37 PM IST

తెలంగాణలోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు జరుపనున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ కోవిడ్ 19 కలవర పెడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్న తొలి కరోనా బాధితుడు మృతి చెందారు. ఆదివారం (మార్చి 29, 2020) 11మందికి కరోనా నయమైంది. సోమవారం (మార్చి 30, 2020) ఆ 11మందిని డిశ్చార్జ్ చేస్తారు. మరో 58 మందికి చికిత్స కొనసాగుతోంది.

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐసోలైషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఫీవర్ ఆస్పత్రిలోనూ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా టెస్టులు నిర్వహిస్తూ వస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 

హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుపనున్నారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి ల్యాబోరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్, బోయిన్ పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ లిమిటెడ్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్, న్యూబోయిన్ పల్లిలోని మెడిసిన్ పాథ్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాథ్ కేర్ ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 

సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్ పేటలోని యశోద ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా చికిత్సపై డాక్టర్లు, నర్సులు శిక్షణ తీసుకున్నారు. కరోనా బాధితులకు అవసరమైన క్వారంటైన్ లు ఏర్పాటు చేశారు.

70 మంది కరోనా బాధితుల్లో ఇప్పటికే ఒకరు కోలుకున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. కోలుకున్న వ్యక్తి ప్రధాని మోడీతో కూడా మాట్లాడినట్టు కేసీఆర్ వెల్లడించారు. అందరూ కోలుకుంటారని, డిశ్చార్జ్ అవుతారని సీఎం కేసీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. 25వేల 900మంది పర్యవేక్షణలో ఉన్నారని, వారిలో చాలామంది క్వారంటైన్ సమయం పూర్తవుతోందన్నారు.

ఇకపై రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువ అని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరికైనా అంటిస్తే తప్ప కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశమే లేదన్నారు కేసీఆర్. సామాజిక దూరమే కరోనాకు ఏకైక మందు అన్నారు. 

Also Read | కరోనా భయం…జర్మనీ ఆర్థికమంత్రి ఆత్మహత్య